పగిడ్యాల: కృష్ణా నదిలో అనుమతి లేని బోట్లు నడిపితే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శివరాముడు హెచ్చరించారు. ‘నిబంధనలు నీట ముంచి.. ప్రయాణికుల రక్షణ మరిచి’ అన్న శీర్షికను గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై తహసీల్దార్ స్పందించారు. ఉదయం పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలసి మూర్వకొండ ఘాట్‌ను పరిశీలించి ఘాట్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణానది బ్యాక్‌వాటర్‌లో ఎలాంటి ఇంజిన్ బోట్లు తిప్పరాదని ఆదేశించారు. ఫోర్ట్ అధికారులు జారీ చేసి న బోటుకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, బోట్ లైసెన్స్ తెచ్చుకోవాలన్నారు. బోట్లు తిప్పకుండా ప్రతి రోజు మూర్వకొండ ఘాట్ వద్ద రెవెన్యూ అసిస్టెంట్లకు బందోబస్తు విధులు వేస్తామన్నారు. తహసీల్దార్ వెంట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీరంగారెడ్డి, వీఆర్వో వెంకటస్వామి, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అసిస్టెంట్లు ఉన్నారు.
ఆదర్శ పాఠశాల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): ఆదర్శ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు ఈనెల 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించేందుకు www. cse.ap.gov.in, www.apms. apcfss.in వెబ్‌సైట్ సంప్రదించాలి. ఆరో తరగతిలో ప్రవేశానికి గతేడాది మాదిరిగానే పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూల్లోనే ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా రోస్టర్ ప్రకారం సీట్లను కేటాయించనున్నారు. ఏప్రిల్ 27న మెరిట్ లిస్ట్, అదే రోజు సెలక్షన్ లిస్ట్‌ను సైతం వెల్లడిస్తారు. ఏప్రిల్ 30న సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ రూల్స్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ పాఠశాలల్లో ఒక్కసారి సీటు దక్కితే ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకూ చదువుకోవచ్చాన్నారు.
యువకుడిపై పోక్సో కేసు నమోదు
జూపాడబంగ్లా: 16 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసగించిన యువకునిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ లక్ష్మీ నారాయణ గురువారం తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. భాస్కరాపురం గ్రామానికి చెందిన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో బిజినెస్ కరస్పాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ జూపాడుబంగ్లా జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న ఓ బాలికను ప్రేమిస్తున్నాను, పెళ్లిచేసుకొంటానని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన బాలిక చివరకు మోసపోయింది. పెళ్లి చేసుకోకుండా మొహం చాటేయడంతో బాలిక జూపాడుబంగ్లా పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ప్రశాంత్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనుమతి లేని బోట్లు నడిపితే చర్యలు