కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు అధికారులపై టీడీపీ నాయకులు జులం ప్రదర్శిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ తమ వాళ్లకే దక్కాలని, మళ్లీ టెండర్లు పిలవాలని, లేదా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏదో ఒకటి తమ వాళ్లకే ఇవ్వాల్సిందేనని ఏకంగా సీఈవో చాంబరులోకి చొచ్చుకెళ్లి రభస సృష్టించారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకు అధికారులు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కోసం ఇటీవల టెండర్లు పిలిచారు. టెండరుదారుల సమక్షంలోనే గురువారం టెండర్లు ఓపెన్ చేశారు. ఐదుగురు టెండర్లు వేయగా.. టెక్నికల్ బిడ్‌లో ఇద్దరికి మాత్రమే అర్హత లభించింది. పైనాన్సియల్ బిడ్‌లో ఎవ్వరు తక్కువ సర్వీస్ చార్జీలతో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని నిర్వహిస్తామని కోట్ చేసి ఉంటారో వారికే టెండరు ఖరారు చేస్తారు. డీసీసీబీలో జీవీఎల్ మ్యాన్ పవర్ సప్లయి ఏజెన్సీస్ సర్వీస్ చార్జీ కేవలం 2 శాతం మాత్రమే కోట్ చేసింది. మరో ఏజెన్సీ 8 శాతం సర్వీస్ చార్జీలను కోట్ చేసింది. దీంతో డీసీసీబీ అధికారులు జీవీఎల్ సంస్థకే టెండరు ఖరారు చేశారు. డీసీసీబీలో 106 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ ఈ సంస్థ తరుఫున పని చేస్తారు. ఈ సంస్థ మూడు నాలుగేళ్లుగా పని చేస్తోంది. ఎలాంటి రిమార్కులు లేవు. టెండర్లు పిలిచే ముందు ఈ సంస్థను కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నుంచి తప్పించారు. తాజాగా పిలిచిన టెండర్ల ద్వారా అతి తక్కువ సర్వీస్ చార్జీ కోట్ చేయడం ద్వారా ద్వారా మళ్లీ దక్కించుకున్నారు. జీవీఎల్ సంస్థపై వైఎస్సార్‌సీపీ ముద్ర వేసిన నందికొట్కూరు, పాణ్యం ఎమ్మెల్యే వర్గీయులు బ్యాంకు అధికారులపై అక్కసు వెల్లగక్కుతున్నారు. పథకం ప్రకారం జీవీఎల్‌కే టెండరు దక్కే విధంగా చేశారని ఆక్రోశం వ్యక్తం చేశారు. కాగా పాలక వర్గాలు ఉంటే వాళ్లు చెప్పిన సంస్థను ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం పాలక వర్గాలు లేవు. జాయింట్ కలెక్టర్ నవ్య అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. ఈ సమయంలో పారాదర్శకంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని టెండరు ద్వారా ఎంపిక చేశారు. దీనిని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక అధికారులపై జులుం ప్రదర్శిస్తున్నరనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ నేతల చేసిన రభసను బ్యాంకు అధికారులు మూడవ పట్టణ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
డీసీసీబీలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ
టెండర్లపై రభస
అతి తక్కువ సర్వీస్ చార్జీ కోట్ చేసిన
జీవీఎల్‌కు సంస్థకు ఖరారు
తమ వారికే ఏజెన్సీ దక్కాలని
టీడీపీ నేతల పట్టు