
వారికి తీరిక లేదు.. వీరికి జీతాలు రావు
కర్నూలు సిటీ: హొళగుంద కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ టి.శ్రీనివాసులు గత నెలలో తనిఖీకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న కొందరు ఉద్యోగులు ‘సార్..మాకు ఐదు నెలలుగా జీతాలు రావడం లేదు. రోజు పని చేస్తున్నా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒక్క కేజీబీవీలోనే కాదు.. ఉమ్మడి జిల్లాలోని 55 కస్తూర్బాల్లో గతేడాది నవంబరులో నియమించిన 130 మంది టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు వేతనాలు రావడం లేదు. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి చిరుద్యోగులు తీసుకపోయినా కూడా అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. ఐదు నెలలుగా వారికి జీతాలు ఎందుకు రావడం లేదో తెలిసినా కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వేతనాలు అందక పోవడంతో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. పండగలు సైతం చేసుకోలేక పోయామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన నియామకాల్లో ఉద్యోగాలు పొందిన వారికి ఎక్కడా కూడా జాప్యం లేకుండా మొదటి నెల నుంచే వేతనాలు అందుతున్నాయి. కర్నూలు జిల్లాలో 26, నంద్యాల జిల్లాలో 27 కస్తూర్బాలు ఉన్నాయి. ఈ స్కూళ్లలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు గతేడాది అక్టోబరు నెలలో నోటిఫికేషన్ ఇచ్చి..అర్హుల జాబితాను కొంత ఆలస్యంగానే ప్రకటించారు. కర్నూలు జిల్లాలో 47 మంది, నంద్యాల జిల్లాలో 83 మందిని నియమించారు. అయితే ఆ సమయంలో ఎంపికై న వారి జాబితా కలెక్టర్ ఆమోదం తీసుకుని నియామక పత్రాలను అందజేశారు. ఆ తరువాత ఎంపికై న వారి బ్యాంకు, తదితర వివరాలను సేకరించి పూర్తి వివరాలతో ఈ ఏడాది జనవరి నెలలో ఆప్కాస్‌లో వారిని చేర్చేందుకు జాబితాను పంపించారు. అయితే ఆ జాబితాకు జిల్లా ఇన్‌చార్జ్‌ల మంత్రి ఆమోదం లేక వెనక్కి పంపించేశారు. అప్పటి నుంచి సుమారుగా రెండు నెలలుగా కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, నంద్యాల జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ చుట్టూ సంతకాలు కోసం అధికారులు తిరుగుతున్నారు. కానీ జాబితాలపై సంతకాలు చేసేందుకు వారికి తీరిక లేదని మంత్రుల పేషీ నుంచి సమాధానాలు వస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇన్‌చార్జ్ మంత్రుల ఆమోదం లేదని వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు.
వేతనాల కోసం కేజీబీవీల్లో
ఉద్యోగుల నిరీక్షణ
గతేడాది నవంబర్‌లో నియామకాలు
ఆప్కాస్‌లో చేర్చేందుకు జాబితా
పంపిన సమగ్ర శిక్ష అధికారులు
ఇన్‌చార్జ్ మంత్రుల ఆమోదం లేదని
వెనక్కి వచ్చిన ఫైల్
వైఎస్సార్‌సీపీ హయాంలో
నియమించిన వారికి మొదటి నెల నుంచే వేతనాలు జమ
చర్యలు తీసుకుంటున్నాం
కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో కొత్తగా నియమించిన టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు త్వరలో వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. వేతనాలు చేసేందుకు జాబితా ఆస్కాస్‌కి పంపగా, ఆ జాబితాకి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆమోదం పొందిన తరువాత జీతాలు చెల్లిస్తామని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ఇన్‌చార్జ్ మంత్రి జిల్లాకు రానున్నారు. వచ్చిన తరువాత సంతకం చేయించిన వెంటనే వేతనాలు వచ్చే అవకాశం ఉంది.
– టి.శ్రీనివాసులు,
సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్