
మంత్రి అనుచరుడా మజాకా!
నంద్యాల(అర్బన్): అడిగేవారు లేరని.. అడ్డుకునే వారు రారని నంద్యాల మండల టీడీపీ నాయకులు సీలింగ్ భూములపై కన్నేశారు. నకిలీ పత్రాలతో అక్రమ లేఅవుట్ల వేసి సొమ్ము చేసుకుంటున్నారు. సీలింగ్ భూములను అమ్మడం, కొనుగోలు చేయకూడదనే నిబంధనలకు రెవెన్యూ అధికారులు తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చాబోలు గ్రామం కర్నూలు – కడప జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరా రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు మాత్రమే ఉన్న భూముల విలువ జాతీయ రహదారి ఏర్పాటుతో ఎకరా రూ.5 కోట్ల రూ.7 కోట్ల వరకు చేరింది. సెంటు స్థలం కూడా పట్టణ ధరలను మించి పోవడంతో స్థలాలు, పొలాలకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఈ క్రమంలో గ్రామ పరిసరాల్లోని సీలింగ్, అసైన్డ్, పోరంబోకు స్థలాలపై కూటమి నాయకుల కన్ను పడింది. అధికారంలోకి వచ్చాక ఎక్కడ కాస్త జాగా కనపడినా కబ్జా చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఆక్రమించేసి అమ్మేస్తున్నారు. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఐదు దశాబ్దాల క్రితం పలువురు రైతుల నుంచి ప్రభుత్వం సర్వే నెం.109/ఏలో 4.50 ఎకరాల భూమిని సీలింగ్ చేసింది. కాల క్రమేణ గ్రామంలోని మూడు పేద కుటుంబాలకు 2.50 ఎకరాల సీలింగ్ భూములను పంపిణీ చేసింది. మిగిలిన 2 ఎకరాల భూమిలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పేద లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించే క్రమంలో పట్టాలు ఇచ్చింది. ఊరి చివర కావడంతో ఆ ప్రాంతంలో నివాసం ఉండేందుకు స్థానికులు సుముఖత చూపలేదు. దీంతో అప్పట్లో ఇచ్చిన పట్టాలను కొంత కాలానికి రద్దు చేసింది. కాగా గ్రామ సమీపాన బైపాస్ రోడ్డు రావడం, గ్రామాభివృద్ధి జరుగుతుండటంతో 2021 లో ఆ రెండు ఎకరాల భూముల్లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జగనన్న కాలనీ ఏర్పాటు చేస్తూ 67 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. అయితే కోర్టులో కేసు ఉండటంతో ఇళ్ల నిర్మా ణం జాప్యమైంది. కొన్నాళ్ల తర్వాత లబ్ధిదారులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు సిద్ధమవుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా..
వివాదాల్లో నలుగుతున్న 4.50 ఎకరాల సీలింగ్ భూ ములపై స్థానిక టీడీపీ నాయకుడు కన్నేశాడు. మొదట కొంత భాగాన్ని ఆక్రమించుకోవాలని వేసిన స్కెచ్ పారింది. ప్రస్తుతం ఆ భూమిని సాగు చేసుకుంటున్న ముత్తయ్య కుటుంబం నుంచి కొనుగోలు చేసి ఆ పక్కనే ఉన్న జగనన్న కాలనీకి కేటాయించిన 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా ఎకరా భూమిలో వెంచర్ వేసి ప్లాట్లు అమ్మకానికి పెట్టాడు. స్థానిక మంత్రికి ఈ నాయకుడు ముఖ్య అనుచరుడు కావడంతో రెవెన్యూ అధికారులు సైతం అభ్యంతరాలు తెలపలేదు. సీలింగ్ భూములను అమ్మకాలు, కొనుగోలు చేసేందుకు వీలుండదని తెలిసినా ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
నోటీసులు ఇచ్చాం
డొంక, శ్మశాన, పోరంబోకు సీలింగ్ భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వదు. సీలింగ్ భూముల్లో వంశపారపర్యంగా సాగు చేసుకొని జీవించాలే తప్ప అమ్మకాలు జరపకూడదు. ఆ భూములను ఎవరూ కొనడానికి వీలు లేదు. భూముల్లో వెంచర్లు వేసిన వారికి నోటీసులు ఇచ్చాం. వారి నుంచి సమాధానం రాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాసులు, నంద్యాల రూరల్ తహసీల్దార్
చాబోలు గ్రామంలో 4.50 ఎకరాల
సీలింగ్ ల్యాండ్ కబ్జాకు యత్నం
ముందుగా ఎకరా స్థలంలో
వెంచర్ వేసి ప్లాట్ల అమ్మకాలు
చోద్యం చూస్తున్న అధికారులు