
పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలి
నంద్యాల(న్యూటౌన్): పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని సీపీఎం నాయకులు అన్నారు. నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్ సెంటర్‌లో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వంట గ్యాస్ ధర దశల వారీగా పెంచుతూ పోవడంతో సామాన్యుడికి కొనే పరిస్థితిలో లేదన్నారు. కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకొనే దుస్థితి చేరిందన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు కొనలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, వెంకటలింగం, తోట మద్దులు, నరసింహలు, నాయకులు నాగన్న, శివన్న ,జయాలాన్ పాల్గొన్నారు.