
అన్ని వేళలా.. అంతటా గ‘మ్మత్తు’
బొమ్మలసత్రం: జిల్లాలో ఊరూరా మద్యం ఏరులై పారుతోంది. పాఠశాలలు ఉన్న ప్రాంతాలను, ప్రముఖ పుణ్య క్షేత్రాలు ఉన్న పట్టణాలను సైతం ‘కూటమి’ నేతలు వదలడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసుకుని మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు వ్యాపారాలు సాగిస్తున్నారు. ఆహోబిలం క్షేత్రంలో ఏకంగా మూడు బెల్టు దుకాణాలను ‘కూటమి’ నేతలు నడుపుతున్నారు. ఈ దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారు పాలకులకు నేరుగా రూ. 6 లక్షలు ముట్టచెప్పినట్లు స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. మహానంది దేవాలయానికి వెళ్లే మార్గంలో ఒక కూల్‌డ్రింక్ దుకాణంలో మద్యం విక్రయాలు బాహాటంగా సాగుతున్నాయి. హిందూ దేవాలయాల పవిత్రతను దెబ్బ తీసేలా ‘కూటమి’ నేతలు వ్యవహరించటంపై విమర్శలు వస్తున్నాయి. నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర వసతి గృహం సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇలా చేసింది..
● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ
మద్యం దుకాణం వద్ద ఎవరైనా మద్యం
సేవించాలంటే భయపడిపోయేవారు. నిత్యం
సెబ్, పోలీస్ అధికారులు పర్యవేక్షణ ఉండేది.
● ఎక్కడా బెల్టుషాపులు కనిపించేవి కాదు.
● నాటుసారా వ్యాపారులపై పోలీసులు
పీడియాక్ట్ నమోదు చేసేవారు.
● జనావాసాలకు దూరంగా మద్యం
దుకాణాలు ఉండేవి.
● ఆలయాలు ఉండే ప్రాంతాల్లో, పాఠశాలల
సమీపంలో మద్యం విక్రయాలు కనిపించేవి కాదు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలా..
● ఎక్కడ చూసినా ‘కూటమి’ నేతల మద్యం దుకాణాలే కనిపిస్తున్నాయి. వైన్‌షాప్‌ల వద్దే మద్యం తాగేందుకు వీలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.
● ఆదాయం కోసం ఎక్కడ పడితే అక్కడ వైన్‌షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం లైసెన్స్ జారీ చేసింది.
● జిల్లాలో ప్రస్తుతం కల్లుగీత కార్మికులకు కేటాయించిన 11 మద్యం దుకాణాలతో కలుపుకొని 116 వైన్‌షాపులు, 22 బార్ అండ్ రెస్టారెంట్‌లు ఉన్నాయి.
● నంద్యాల పట్టణంలో ఒక హోటల్ పక్కనే ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ మొదలుకొని పద్మావతి నగర్‌లో ప్రముఖ దేవాతామూర్తి పేరుమీద ఉన్న వైన్‌షాప్‌లలో వేకువజామున నుంచి విక్రయాలు మొదలవుతాయి. రాత్రి 12 దాటిన తర్వాత కూడా అక్కడ మద్యం దొరుకుతుందంటే యజమానుల ధనదాహం ఏరీతిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది.
● కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామంలో కొందరు ‘కూటమి’ నేతలు బెల్టు దుకాణాలను ఏర్పాటు చేశారు. ఫోన్ కాల్ చేస్తే చాలు అక్కడికే మద్యం, వాటర్ పాకెట్లు, స్నాక్స్ తీసుకుని వెళ్తారు. ఈ వింతను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.
పోటాపోటీగా బెల్టు దుకాణాలు
జిల్లాలో మొత్తం 29 మండలాల్లో 449 గ్రామాలు ఉన్నాయి. రాష్ట్రంలో ‘కూటమి’ ప్రభుత్వం రాగానే గతంలో మూతపడిన బెల్టు దుకాణాలు, నాటుసారా స్థావరాలు గ్రామాల్లో తిరిగి తెరుచుకున్నాయి. స్థానిక టీడీపీ నేతకు రూ. 2 లక్షల వరకు ఇచ్చి బెల్టు దుకాణాలను నడిపిస్తున్నారు. పోలీసులు దాడి చేయకుండా టీడీపీ నాయకులే అడ్డుతున్నారు. నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలంలో ఇద్దరు టీడీపీ నాయకులు పోటాపోటీగా బెల్టు దుకాణాలు నడుపుతున్నారు.
జిల్లాలో ఏరులై పారుతున్న మద్యం
ప్రతి రోజూ 24 గంటల పాటు
విక్రయాలు
నిబంధనలకు విరుద్ధంగా
బెల్టు దుకాణాల ఏర్పాటు
బడి, గుడి ఉన్న ప్రాంతాల్లోనూ
మద్యం విక్రయాలు
మహానంది, ఆహోబిల క్షేత్రాల
పరిధిలోనూ ‘బెల్టు’ భూతం
డోన్, గోస్పాడు మండల కేంద్రాల్లో
మద్యం డోర్ డెలివరీ
మద్యం బేరంపై ‘కూటమి’ నేతల మధ్య
నిత్యం రగడ

అన్ని వేళలా.. అంతటా గ‘మ్మత్తు’