
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
కోడుమూరు రూరల్/గోనెగండ్ల: పులకుర్తి – గూడూ రు రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. గోనెగండ్ల మండలం ఆలువాల గ్రామానికి చెందిన బోయ నాగేంద్ర కుమారుడు హర్షవర్దన్‌నాయుడు (20), ఇదే గ్రామానికి చెందిన జయరాజు(25) సొంత పనుల నిమిత్తం బైక్‌పై గూడూరుకు వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం తమ స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలో పులకుర్తికి 2 కి.మీ దూరంలో గూడూరు వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హర్షవర్దన్‌నాయుడు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన జయరాజును చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన నాగేంద్ర, శంకరమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు హర్షవర్దన్ ఉన్నారు. ఈ దంపతులు ఇటీవల కుమారుడితో కలసి వలస వెళ్లారు. కాగా మూడు రోజుల క్రితం హర్షవర్దన్ స్వగ్రామానికి చేరుకుని శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. మృతుడి మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు స్వగ్రా మానికి బయలుదేరారు. అలాగే టిప్పర్ డ్రైవర్‌గా పని చేసే జయరాజుకు భార్య సజ్జీవతో మూడేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఒకే రోజు చనిపోవడంతో ఆలువాల గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతిచెందిన హర్షవర్దన్ నాయుడు, జయరాజు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి