
పత్తి విత్తన ప్రాసెసింగ్ యూనిట్లలో తనిఖీలు
కర్నూలు(అగ్రికల్చర్): బీటీ పత్తి విత్తనాల ప్రాసెసింగ్ ప్రక్రియ చురుగ్గా జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి వచ్చిన అధికారులు తనిఖీలు చేపట్టారు. పత్తిలో హెచ్‌టీ విత్తనాలను గుర్తించేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. హెచ్‌టీ పత్తి విత్తనాలు పర్యావరణానికి, జీవవైవిద్యానికి హాని కలిగిస్తాయనే ఉద్దేశంతో వీటికి కేంద్రం అనుమతులు ఇవ్వలేదు. హెచ్‌టీ విత్తనాల గ్లైపోసేట్ అనే కలుపు మందును తట్టుకుంటాయి. హెచ్‌టీ విత్తనాలతో పత్తి సాగు చేసినపుడు కలుపు సమస్య ఏర్పడితే గ్లైపోసేట్ మందు పిచికారి చేస్తే కలుపు మొక్కలు నశిస్తాయి.. పత్తి పంటకు ఏమీ కాదు. గ్లైపోసేట్ కలుపు మందు పిచికారి చేస్తే పర్యావరణం దెబ్బతింటుందనే ఉద్దేశంతో అనుమతులు లేవు. కాని హెచ్‌టీ పత్తి విత్తనాలు మార్కెట్‌లో ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమిషనరేట్ నుంచి ఏడీఏ కల్యాణ్‌కుమార్, ఏవో లక్ష్మిరెడ్డిలతో కూడిన టీమ్ కర్నూలులో తనిఖీలు చేపట్టింది. కర్నూలులో బీటీ పత్తి విత్తనాల ప్రాసెసింగ్ ప్రక్రియ ప్రస్తుతం శ్రీరామ సీడ్స్, కర్నూలు సీడ్స్, ధనలక్ష్మి సీడ్స్, మహలక్ష్మి సీడ్స్, విజయసాయి, గౌతమీ సీడ్స్‌లో జరుగుతోంది. ప్యాకింగ్‌కు ముందే హెచ్‌టీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ఆయా ప్రాసెసింగ్ కేంద్రాల్లో లాట్ల వారీగా హెచ్‌టీ పరీక్షలు నిర్వహించారు. అక్కడికక్కడే 11 పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది.అంటే హెచ్‌టీ విత్తనాలు లేవని నిర్ధారణ అయింది. కర్నూలులో తనిఖీలు పూర్తి అయిన తర్వాత ఈ టీమ్ అధికారులు ఆదోనిలో పరీక్షలు నిర్వహించారు. వారి వెంట కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, కల్లూరు ఏవో శ్రీనివాసరెడ్డి ఉన్నారు.