లింగ నిర్ధారణ కట్టడికి పటిష్ట చర్యలు
నారాయణపేట: జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి బహుళ సభ్య అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గర్భస్థ పూర్వము, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేదం చట్టం 1994 అమలుపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ .. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లపై నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. జిల్లాలో లింగ నిష్పత్తి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న ఎస్పీ యోగేశ్ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెడుతూ లింగ నిర్ధారణ తెలిపే కేంద్రాలపై పీసీపీఎన్‌డీటీ యాక్ట్ 1994 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి సూచించారు. అలాగే మొదటి, రెండు మాసాలలో జరిగే గర్భస్రావాలపై దృష్టి సారించాలన్నారు. జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సౌభాగ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 5 స్కానింగ్ కేంద్రాల అనుమతికి దరఖాస్తు చేసుకోగా వాటిని పరిశీలించి పర్యవేక్షించి అనుమతి ఇవ్వడం జరిగిందని, వాటిలో ఒకటి ప్రభుత్వ, నాలుగు ప్రైవేట్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఈ చట్టం, దాని విధి విధానాలు, వ్యతిరేకించే వారిపై విధించే శిక్షలు, జరిమానాలను డాక్టర్ శైలజ వివరించారు. సమావేశంలో సఖి కేంద్రం ఏవో క్రాంతి రేఖ,ఎంపీ హెచ్ ఈ ఓ గోవిందరాజు, శ్రీనివాసులు, వసంత పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
నారాయణపేట: జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లా జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) సమన్వయకర్తగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్ ఇటీవలే బాధ్యతలు చేపట్టడంతో సోమవారం కలెక్టర్ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ కిషన్, వైద్య నిపుణులు డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ మోహన్‌తో ఆస్పత్రిలో వైద్య సేవలు, సిబ్బంది, బడ్జెట్ తదితర అంశాలపై కలెక్టర్ చర్చించారు. ఈ వేసవికాలం ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, వైద్యశాఖ పరంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలన్నారు. ఇక నుంచి మెడికల్ కళాశాలతో పాటు జిల్లా ఆస్పత్రి పర్యవేక్షణను చూసుకోవాలని ప్రిన్సిపల్‌కు ఆమె సూచించారు. ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్ అవసరమని, ఎవరినైనా డిప్యూట్ చేయించాలని రాంకిషన్ కలెక్టర్‌ను కోరారు. జిల్లా ఆసుపత్రి, చిన్న పిల్లల ఆసుపత్రిలో 20 మంది శానిటేషన్ వర్కర్లు పని చేస్తున్నారని, అదనంగా అవసరం అయితే తీసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఆస్పత్రి భవన ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు.
స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాలి
కలెక్టర్ సిక్తా పట్నాయక్
Comments
Please login to add a commentAdd a comment