ఆస్పత్రి వార్డులో కాలిపోయిన సామగ్రి, ఇతర వస్తువులు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని భందారా ప్రభుత్వాసుపత్రిలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని ప్రత్యేక న్యూబార్న్ కేర్ యూనిట్(ఎస్‌ఎన్‌సీయూ)లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది పసికందులు ప్రాణాలు కోల్పోయారు. ఆ యూనిట్‌లో మొత్తం 17 మంది నవజాత శిశువులు ఉండగా, వారిలో ఏడుగురిని రక్షించినట్టు వైద్యులు తెలిపారు. మరణించిన వారంతా ఒకటి నుంచి మూడు నెలలోపు పసిబిడ్డలే కావడం విషాదం. మృతి చెందిన పది మందిలో ముగ్గురు కాలిన గాయాలతోనూ, మిగిలిన ఏడుగురు పొగ కారణంగా ఊపిరాడక మృత్యువాత పడ్డట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ టోప్ తెలిపారు. ఆరోగ్య శాఖ డైరెక్టర్ నాయకత్వంలో ఘటనపై విచారణకు ఆరుగురు సభ్యుల కమిటీని నియమించినట్టు, మూడు రోజుల్లో నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్టు మంత్రి తెలిపారు.
సెక్యూరిటీ ఉద్యోగి గౌరవ్ రహపాడే మీడియాతో మాట్లాడారు. ‘పై వార్డుకు ఉన్న కిటికీ వద్దకి చేరుకుని అద్దాలు పగుల కొట్టి లోపలికి చేరాం. అనంతరం వెనుక ద్వారం నుంచి పిల్లలను బయటికి తీసుకవచ్చాం. ఏడుగురికి రక్షించగలిగాం. ఒక విభాగంలోని ఏడుగురిని రక్షించినప్పటికీ 10 మంది ఉన్న మరో విభాగం నుంచి ఎవరినీ రక్షించలేకపోయాం’ అని రహపాడే తెలిపారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రమాద ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులెవరినీ వదిలిపెట్టేది లేదనీ, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. మృతిచెందిన పసివారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటన పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు.
ఏం జరిగిందంటే..?
ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యూబార్న్ కేర్ యూనిట్‌లో తక్కువ బరువున్న చిన్నారులకు చికిత్సనందిస్తున్నారు.రాత్రి 1.30 గంటలపుడు యూనిట్‌లో మంటలు చెలరేగాయని జిల్లా సివిల్ సర్జన్ ప్రమోద్ ఖాన్‌దేట్ చెప్పారు. విషయాన్ని ముందుగా ఒక నర్సు గుర్తించి, వైద్యులను, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఐదు నిమిషాల్లోనే అక్కడికి చేరుకుని వార్డులోని కిటికీ తలుపుల గుండా ఏడుగురు పసికందులను పక్క వార్డులోకి మార్చారు. యూనిట్‌లో అగ్ని మాపక పరికరాలున్నా పొగ తీవ్రత కారణంగా మిగతా వారిని రక్షించడం సాధ్యం కాలేదన్నారు. ఆ యూనిట్‌లో 24 గంటల ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లున్నాయి. భవనంలో మంటలు వ్యాపించడానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటుందని భావిస్తున్నారు.
మహారాష్ట్రలో ఘోరం
మహారాష్ట్రలోని భందారా ప్రభుత్వాసుపత్రిలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని ప్రత్యేక న్యూబార్న్ కేర్ యూనిట్(ఎస్‌ఎన్‌సీయూ)లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది పసికందులు ప్రాణాలు కోల్పోయారు. ఆ యూనిట్‌లో మొత్తం 17 మంది నవజాత శిశువులు ఉండగా, వారిలో ఏడుగురిని రక్షించినట్టు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment