ముంబైలోని ‘సాత్ బంగ్లా’ అనే ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. సుమారు 124 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏడు బంగ్లాలు నిర్మించారు. వాటిలో ఇప్పుడు రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు వాటిలో ఒకదానిని కూల్చివేసేందుకు బీఎంసీ సిద్ధమవుతోంది. దీంతో భవన యజమాని కోర్టును ఆశ్రయించారు.
సముద్రతీరానికి దగ్గరలో నిర్మించిన ఈ బంగ్లాలో పలు గదులు, గ్లాస్ వర్క్‌తో కూడిన హాలు, ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్‌లు, బసాల్ట్ స్టోన్ ఫ్లోరింగ్ ఉన్నాయి. ఈ బంగ్లాను ‘1900 ఏడీ’లో నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఈ భవనం చరిత్రకు ఆనవాలుగా నిలిచింది. కాగా గత ఫిబ్రవరి 29న రతన్ కుంజ్ పేరుతో ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయనున్నట్లు బీఎంసీ దాని యజమానికి నోటీసు జారీ చేసింది. ఈ భవనం శిథిలావస్థలో ఉందని, కూలిపోయే అవకాశం ఉందని ఆ నోటీసులో పేర్కొంది.
అయితే ఈ ఆస్తి సహ యజమానులు షాలు రాహుల్ బరార్‌తో పాటు అతని ఇద్దరు కుమారులు ఈ నోటీసు వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ‘మా ఆడిట్, ఇన్‌టేక్ నివేదికలో ఈ ఆస్తిని భద్రంగా చూస్తామని పేర్కొన్నాం. భవనానికి మరమ్మతులు చేశాం. ఈ కూల్చివేత నోటీసు మాకు పెద్ద దెబ్బ లాంటిది. మా చివరి శ్వాస వరకూ ఈ బంగ్లాను కాపాడుకునేందుకు పోరాడుతాం’ అని పేర్కొన్నారు.
ఒకప్పుడు ఈ బంగ్లాను ‘తలాటి బంగ్లా’ అని పిలిచేవారు. సొరాబ్జీ తలాటి పార్సీ కుటుంబం దీనికి ఈ పేరు పెట్టింది. 1896లో దేశంలో ప్లేగు వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ ‘ఏడు బంగ్లాలు’ నిర్మితమయ్యాయి. ఈ భవనం పూర్వ యజమానులు గ్వాలియర్ మహారాజా, కచ్ మహారాజా, దాదాభాయ్ నౌరోజీ, రుస్తమ్ మసాని, సొరాబ్జీ తలాటి, చైనాస్, ఖంబటాస్. ఇటువంటి వారసత్వ సంపదను కాపాడుకోవడం అవసరమని ఆ కుటుంబ సభ్యులు అంటున్నారు. దీనిని చారిత్రక భవనాలు జాబితాలో చేర్చాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment