కరువులు. కల్లోలాలు. కొట్లాటలు. కన్నీళ్లు...
క్లుప్తంగా చెప్పుకుంటే ప్రపంచానికి 2023 ప్రధానంగా మిగిల్చిన గుర్తులివే! 2022లో ఉక్రెయిన్‌పై రష్యా మొదలు పెట్టిన ఆక్రమణ 2023 పొడవునా పడుతూ లేస్తూ కొనసాగింది. ఇది చాలదన్నట్టు ఏడాది చివర్లో ఇజ్రాయెల్ దండయాత్ర పాలస్తీనాలో కనీవినీ ఎరగని మానవీయ సంక్షోభానికి కారణమైంది. లక్షలాది మంది ఆకలి కేకలు ఐరాస సామర్థ్యంపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తాయి. అంతర్జాతీయ సమాజంలో మానవీయ స్పందన కరువైన తీరును కళ్లకు కట్టాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అటు కరువు, ఇటు వరదలతో అతలాకుతలమయ్యాయి.
భూతాపోన్నతి ఒకానొక దశలో 2 డిగ్రీల లక్ష్మణరేఖను దాటేసి ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పును మరోసారి గుర్తు చేసింది. ఏదో ఒక రూపంలో అడపాదడపా తలెత్తుతున్న కరోనా ఏడాది ముగుస్తుండగా కొత్త వేరియంట్ రూపంలో మరోసారి గుబులు పుట్టిస్తోంది. చంద్రయాన్, జీ20 సదస్సు నిర్వహణ వంటివి భారత కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ వేదికపై మరింతగా చాటాయి. 2023 త్వరలో కాలగర్భంలో కలిసిపోనున్న నేపథ్యంలో ఈ ఏడాది భారత్‌లోనూ, అంతర్జాతీయంగానూ జరిగిన ప్రధాన సంఘటనలపై విహంగ వీక్షణం. – సాక్షి, నేషనల్ డెస్క్
A ఆర్టికల్ 370
జమ్మూ కశ్మిర్‌కు పలు విషయాల్లో ప్రత్యేక హోదా కల్పించిన ఈ వివాదాస్పద ఆర్టికల్‌ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. ఏ రాష్ట్రానికీ విడిగా అంతర్గత ప్రజాస్వామ్యం అంటూ ఉండబోదని కుండబద్దలు కొట్టింది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం డిసెంబర్ 11న ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. దాంతో కశ్మిర్‌కు ప్రత్యేక పతాకం, రాజ్యాంగం, అంతర్గత వ్యవహారాల్లో పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 శాశ్వతంగా కాలగర్భంలో కలిసిపోయింది.
B బైడెన్
అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడైన 81 ఏళ్ల బైడెన్.. 2024లో అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ నెగ్గి తన రికార్డును తానే మెరుగుపరచాలని ప్రయత్నిస్తున్నారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు సాయుధ, ఆర్థిక మద్దతు కొనసాగింపుపై విమర్శలతో పాటు పాలస్తీనాలో మానవీయ సంక్షోభం ముదురుతున్నా యుద్ధం ఆపేలా ఇజ్రాయెల్‌ను ఒప్పించలేకపోతున్నారంటూ ఈ ఏడాది మరో అప్రతిష్ట కూడా మూటగట్టుకున్నారాయన. రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష బరిలో దిగేలా ఉన్న డొనాల్డ్ ట్రంప్ నుంచి బైడెన్‌కు గట్టి పోటీ తప్పకపోవచ్చంటున్నారు. కోర్టు కేసులు 77 ఏళ్ల ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లని పక్షంలో 2020లో మాదిరే ఈసారి కూడా అధ్యక్ష పీఠం కోసం వీరిద్దరే పోటీ పడేలా ఉన్నారు.
C చంద్రయాన్–3
అంతరిక్ష రంగంలో భారత కీర్తి పతాకను సమున్నతంగా ఎగరేసిన కీలక ప్రయోగం. 2023 జూలై 14న శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం దిగ్విజయం సాధించింది. ఆగస్టు 5న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన వ్యోమ నౌక 23న చంద్రుని దక్షిణ ధ్రువ సమీపంలో సురక్షితంగా దిగింది. ఈ విజయానికి గుర్తుగా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రధాని మోదీ ప్రకటించారు
D డొనాల్డ్ ట్రంప్
బహుశా అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పదుడైన నేత. ఆ దేశంలో నేరాభియోగాలు ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షునిగా రికార్డు సృష్టించారు. నీలి చిత్రాల తారతో అఫైర్‌ను కప్పిపుచ్చేందుకు డబ్బుల చెల్లింపు వ్యవహారంలో గత ఏప్రిల్లో కోర్టు మెట్లెక్కిన సందర్భంగా సాంకేతికంగా అరెస్టు కూడా అయ్యారు! ఇదీ రికార్డే. దీంతోపాటు 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ క్యాపిటల్ భవనంపై తన సమర్థకులను దాడికి ఉసిగొల్పిన కేసులో ట్రంప్‌ను కొలరాడో సుప్రీంకోర్టు తాజాగా దోషిగా తేల్చింది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించింది! ఇలా అనర్హతకు గురైన తొలి మాజీ అధ్యక్షునిగా కూడా నిలిచారు. అయినా ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు!
E ఎలక్షన్స్
2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఊపునిస్తే విపక్ష కాంగ్రెస్‌ను తీవ్ర నిరాశకు లోను చేశాయి. ఈ ఏడాది చివర్లో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పాలిత రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ల్లో బీజేపీ విజయబావుటా ఎగరేయడమే గాక మధ్యప్రదేశ్‌లోనూ ఘనవిజయం సాధించింది. ఎన్ని హామీలిచ్చినా రాజస్తాన్‌లో ఓటమి చవిచూడటమే గాక అధికారం నిలుపుకోవడం ఖాయమని భావించిన ఛత్తీస్‌గఢ్‌నూ కోల్పోవడంతో కాంగ్రెస్ తీవ్ర నైరాశ్యానికి లోనైంది. తెలంగాణలో సాధించిన అనూహ్య విజయం ఈ ఓటముల ముందు చిన్నబోయింది. ఈ నేపథ్యంలో విపక్ష ఇండియా కూటమి సారథిగా కాంగ్రెస్ ప్రాధాన్యం కూడా తగ్గుముఖం పట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో తమకే ఎక్కువ సీట్లు కేటాయించాలంటూ భాగస్వాముల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి!
F ఫారిన్ అఫైర్స్
విదేశీ వ్యవహారాల్లో 2023 భారత్‌కు మిశ్రమ ఫలితాలిచ్చింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మాదిరిగానే గాజాపై ఇజ్రాయెల్ దాడి విషయంలో కూడా ఏ పక్షం వైపూ పూర్తిగా మొగ్గకుండా ఎప్పట్లాగే కేంద్రం ఆచితూచి స్పందిస్తూ వస్తోంది. అంతేగాక జీ20 సదస్సు నిర్వహణ వంటి పలు అంతర్జాతీయ విజయాలు మన ఖాతాలో పడ్డాయి. అయితే కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ ఉందన్న ఆ దేశ ప్రధాని ఆరోపణలు ద్వైపాక్షిక సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఒకరకంగా ఇరు దేశాల మధ్య నెలల తరబడి ‘దౌత్య యుద్ధమే’ జరిగింది. ఈ విషయంలో అమెరికా కూడా కెనడాకే దన్నుగా నిలవడం మనకు ఇబ్బందికరంగా మారింది.
G జి 20
ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ తొలిసారి ఆతిథ్యమిచ్చింది. సెపె్టంబర్లో ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర ప్రముఖ దేశాల అధినేతలు తరలివచ్చారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మూడు రోజుల శిఖరాగ్రం ఘనవిజయం సాధించి అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి ప్రతష్టలను మరింతగా పెంచింది.
H హెచ్1బీ రెన్యువల్స్
వేలాది భారతీయ టెకీలకు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న కీలకమైన హెచ్1బీ వీసాల విషయంలో అగ్ర రాజ్యం ఈ ఏడాది కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని ఇకపై అమెరికాలోనే రెన్యువల్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. తొలి విడతగా 20 వేల దరఖాస్తుల ప్రాసెసింగ్ ప్రక్రియను మొదలు పెట్టింది కూడా. దాంతో రెన్యువల్స్‌కు భారత్‌కో, మరో దేశానికో వెళ్లాల్సిన అవస్థ తప్పనుంది.
I ఇమ్రాన్ ఖాన్
గతేడాది పాకిస్తాన్ ప్రధాని పదవి పోగొట్టుకుని, హత్యాయత్నం నుంచి తూటా గాయాలతో బయట పడ్డ ఇమ్రాన్ ఖాన్ ఈ ఏడాది ఏకంగా జైలుపాలయ్యారు! భూ వివాదం కేసులో తొలుత మే 9న హైకోర్టు ప్రాంగణంలోనే అరెస్టయ్యారు. తర్వాత విడుదలైనా తోషాఖానా కానుకల కేసులో ఆగస్టు 6న మళ్లీ అరెస్టయ్యారు. అప్పటినుంచీ జైల్లోనే మగ్గుతున్నారు. ఆయనపై 140కి పైగా కేసులు దాఖలయ్యాయి! ఫిబ్రవరిలో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ పావులు కదుపుతోంది. పాక్‌లో సర్వశక్తిమంతమైన సైన్యం కూడా అందుకు పూర్తిగా సాయపడుతున్నట్టు కని్పస్తోంది.
J జిన్‌పింగ్
మావో అనంతరం చైనాలో అత్యంత శక్తిమంతుడైన నాయకునిగా అవతరించారు. 2023 మార్చిలో ఏకంగా వరుసగా మూడోసారి దేశ అధ్యక్షునిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. చైనా చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక నాయకునిగా రికార్డులకెక్కారు. పార్టీలోని ప్రత్యర్థులను ఉక్కుపాదంతో అణచివేస్తూ ఎదురులేని నాయకునిగా మారారు. అయితే కరోనా కల్లోలాన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోయారన్న అప్రతిష్టను మూటగట్టుకున్నారు. లాక్‌డౌన్‌ను భరించలేక జనం భారీగా తిరుగుబాటుకు దిగడంతో నిబంధనలను సడలించాల్సి రావడం జిన్‌పింగ్ ప్రతిష్టకు మచ్చగా మిగిలింది. రియల్టీ భారీ పతనం, ఆర్థిక ఒడిదుడుకులు ఆయనకు సవాలుగా మారాయి.
K కింగ్ చార్లెస్–3
బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేకం జరుపుకున్నారు. మే 6న అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలంతా హాజరయ్యారు. 73 ఏళ్ల చార్లెస్–3 2022 సెప్టెంబర్ 8న తన తల్లి క్వీన్ ఎలిజబెత్–2 మరణంతో గద్దెనెక్కారు. అత్యంత పెద్ద వయసులో ఆ బాధ్యతలు చేపట్టి రికార్డులకెక్కారు. 8 నెలల తర్వాత లాంఛనంగా పట్టాభిషిక్తుడయ్యారు.
L ఎల్‌జీబీటీక్యూఐ
స్వలింగ సంపర్కం ఈ ఏడాదీ తరచూ వార్తల్లో నిలిచింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అది పార్లమెంటు పరిధిలోని అంశమంటూ అక్టోబర్ 17న తీర్పు వెలువరించింది. అయితే స్వలింగ సంపర్కులకూ ఇతరుల మాదిరిగానే అన్ని హక్కులూ ఉంటాయని స్పష్టం చేసింది. వాటిని కాపాడాలని, వారిని ఎవరూ చిన్నచూపు చూడకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని కేంద్రాన్ని, రాష్ట్రాలను ఆదేశించింది.
M మణిపూర్ కల్లోలం
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ ఈ ఏడాది జాతుల హింసతో అట్టుడికింది. సంఖ్యాధికులైన మెయితీ తెగ వారు తమను గిరిజనేతరులుగా గుర్తించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన కుకీలు మే 3న జరిపిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. కుకీ మహిళను దారుణంగా హింసించి నగ్నంగా ఊరేగించడమే గాక అత్యాచారానికి పాల్పడటంతో రాష్ట్రం భగ్గుమంది. అలా చెలరేగిన హింసాకాండ నేటికీ కొనసాగుతూనే ఉంది. వందలాది మంది మరణించగా కనీసం 40 వేల మందికి పైగా కుకీలు పొరుగు రాష్ట్రాలకు వలస బాట పట్టారు. కేంద్రం మెయితీల పట్ల పక్షపాతం చూపుతూ సమస్య పరిష్కారంపై మీనమేషాలు లెక్కిస్తోందంటూ విమర్శలపాలైంది.
N నార్త్ కొరియా
ఉత్తర కొరియా 2023 పొడవునా వరుస క్షిపణి పరీక్షలతో హోరెత్తిస్తూనే ఉంది. పొరుగు దేశం దక్షిణ కొరియానూ, అమెరికానూ హడలెత్తిస్తూనే ఉంది. మొత్తమ్మీద ఈ ఏడాది అది 36కు పైగా క్షిపణి పరీక్షలు జరిపింది. వీటిలో రెండు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు కూడా ఉన్నాయి! దాంతో ఉద్రిక్తతల తగ్గింపుకు ఇరు దేశాల మధ్య 2018లో కుదిరిన ఒప్పందాన్ని దక్షిణ కొరియా రద్దు చేసుకునే దాకా వెళ్లింది.
O అపోజిషన్
కాంగ్రెస్‌తో పాటు 28 విపక్షాలు ఒక్క వేదికపైకి రావడం 2023లో జరిగిన ముఖ్య రాజకీయ పరిణామం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ చొరవతో ఈ కూటమి తెరపైకి వచ్చింది. జూలై 18న బెంగళూరులో జరిగిన రెండో భేటీలో కూటమికి ఇండియా పేరును ఖరారు చేశారు. కూటమి నాలుగుసార్లు సమావేశమై భావి కార్యాచరణపై చర్చించింది. ఎన్నికలు ముంచుకొస్తున్నందున జనవరి రెండో వారంలోగా సీట్ల సర్దుబాటును ఖరారు చేసుకునే పనిలో ఉంది.
P పాకిస్తాన్ దివాలా
2023లో పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు మరింతగా పెరిగాయి. నిత్యావసరాలకు కూడా కటకటలాడే పరిస్థితి తలెత్తింది. బియ్యం, గోధుమ పిండి తదితరాల కోసం జనం కొట్టుకుంటున్న దృశ్యాలు పరిపాటిగా మారాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు అట్టడుగుకు చేరాయి. ఏడాది చివరికి వచ్చేసరికి పాస్‌పోర్టుల ముద్రణకు కావాల్సిన పేపర్ దిగుమతికి కూడా చెల్లింపులు చేయలేని పరిస్థితికి చేరింది. దాంతో ఒక దశలో పాస్‌పోర్టుల జారీయే నిలిచిపోయింది.
Q క్వేక్స్
ఈ ఏడాది భారీ భూకంపాలతో పలు దేశాలు అతలాకుతలమయ్యాయి. ఫిబ్రవరి 6న 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం తుర్కియే, సిరియాల్లో పెను విధ్వంసమే సృష్టించింది. 50 వేల మందికి పైగా దీనికి బలయ్యారు. వీరిలో 44 వేలకు పైగా మరణాలు తుర్కియేలోనే సంభవించాయి! అనంతరం సెపె్టంబర్ 8న మొరాకోలో వచ్చిన 6.8 తీవ్రతతో కూడిన భూకంపానికి 3,000 మందికి పైగా బలయ్యారు. డిసెంబర్ 19న వాయవ్య చైనాలో వచ్చిన భూకంపం 150 మందిని బలి తీసుకుంది. ఉత్తరాఖండ్‌లోని జోషీ మఠ్‌లో నేల కుంగుబాట పట్టిన వైనమూ కలకలం రేపింది. వందలాది ఇళ్లు నిలువునా పగుళ్లిచ్చాయి!
R ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్
ఈ ఏడాది తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై దేశ గౌరవాన్ని రెట్టింపు చేసింది. ఆస్కార్ అవార్డు సాధించిన తొలి భారతీయ చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్ చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుకు ఉత్తమ పాట అవార్డు దక్కింది. మార్చిలో జరిగిన ఆస్కార్ వేడుకలో గీత రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అవార్డును అందుకున్నారు. 2009లో భారతీయ సినిమా ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’లో ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన జై హో పాటకూ ఆస్కార్ వచ్చినా ఆ సినిమాను యూకే ప్రొడక్షన్స్ పతాకంపై హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ రూపొందించారు.
S సస్పెన్షన్లు
2023 ముగింపుకు వచ్చిన వేళ విపక్ష ఎంపీల భారీ సస్పెన్షన్లు పార్లమెంటు శీతాకాల సమావేశాలను వేడెక్కించాయి. డిసెంబర్ 13న లోక్‌సభలో జరిగిన భద్రతా వైఫల్యంపై కేంద్రాన్ని నిలదీస్తూ విపక్ష ఎంపీలు ఉభయ సభలనూ రోజుల తరబడి హోరెత్తించారు. దాంతో లోక్‌సభ, రాజ్యసభ రెండింటి నుంచీ కలిపి వారం రోజుల వ్యవధిలో ఏకంగా 149 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేయడం పార్లమెంటు చరిత్రలో ఇదే తొలిసారి. ఈ వరుస సస్పెన్షన్లు రాజకీయంగా దుమారం రేపాయి.
T టన్నెల్
మనిషి సంకల్పం ముందు మంచు శిఖరం తలొంచింది. ఉత్తరాఖండ్‌లో సిల్‌్కయారా సొరంగం కుప్పకూలి లోన చిక్కుబడ్డ 41 మంది కార్మికులు 16 రోజుల ఉత్కంఠ తర్వాత సురక్షితంగా బయట పడ్డారు. హైవే పనుల్లో భాగంగా నిర్మాణంలో ఉన్న ఈ సొరంగం నవంబర్ 12న పాక్షికంగా కూలిపోయింది. రెస్క్యూ ఆపరేషన్లో రోజుకో సమస్యలతో నిత్యం సస్పెన్సు నెలకొంటూ వచ్చింది. కీలకమైన చివరి అంకం సినిమా క్లైమాక్స్‌నే తలపించింది. యంత్ర బలం చేతులెత్తేసిన వేళ ర్యాట్ హోల్ కార్మికులు చివరి 12 మీటర్ల మేరకు శిథిలాలను జాగ్రత్తగా తవ్వేసి కారి్మకులను బయటికి తీసుకొచ్చారు.
U యూసీసీ
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) ఈ ఏడాది కూడా వార్తల్లో నిలిచింది. కులమత తదితర విభేదాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ ఒకే రకమైన వ్యక్తిగత చట్టాలను వర్తింపజేసేందుకు ఉద్దేశించిన యూసీసీని అమలు చేసే దిశగా ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిపై ఏర్పాటైన దేశాయ్ కమిటీ నవంబర్లో ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో యూసీసీ విషయమై దేశవ్యాప్తంగా ఆసక్తికర పరిణామాలు జరగవచ్చు.
V వెనెజులా
పొరుగున ఉన్న బుల్లి దేశమైన గయానాలో ని ఎసిక్వెబో ప్రాంతంలో అపార చమురు నిక్షేపాలపై వెనెజులా కన్నేయడం ఉద్రిక్తతలకు కారణమైంది. అవసరమైతే సైనిక చర్యకు దిగైనా దాన్ని దక్కించుకునే దిశగా పావులు కదుపుతుండటంతో దక్షిణ అమెరికాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
W వార్స్
2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా మొదలు పెట్టిన యుద్ధం ఈ ఏడాదంతా కొనసాగుతూనే ఉంది. హమాస్ మెరుపుదాడి కారణంగా అక్టోబర్లో పాలస్తీనాపై ఇజ్రాయెల్ తలపెట్టిన యుద్ధమూ భీకరంగా సాగుతూనే ఉంది. ఇలా 2023 యుద్ధ సంవత్సరంగా గుర్తుండిపోనుంది.
X ఎక్స్
ప్రముఖ సోషల్ సైట్ ట్విట్టర్‌ను సుదీర్ఘ కాలయాపన, వివాదాల తర్వాత 2022 చివర్లో సొంతం చేసుకున్న ఎలాన్ మస్‌్క, గత జూలైలో దాని పేరును ఎక్స్‌గా మార్చి మరో సంచలనం సృష్టించారు. బ్లూ టిక్ తీసేయడం మొదలుకుని ఆయన తీసుకున్న పలు నిర్ణయాలతో సంస్థ విలువ సగానికి సగం పడిపోయింది.
Y యెవగనీ ప్రిగోజిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడు. వాగ్నర్ ప్రేవేట్ సైనిక మూక చీఫ్. పుతిన్‌తో విభేదాల నేపథ్యంలో ఆగస్టు 23న ‘విమాన ప్రమాదం’లో ప్రిగోజిన్ మరణించాడు. రష్యాలో ఇలా అనుమానాస్పదంగా కాలగర్భంలో కలిసిపోయిన వారి జాబితాలో చేరిపోయాడు.
Z జియోనిజం
పశి్చమాసియాలో ప్రత్యేక యూదు రాజ్య స్థాపనకు పుట్టుకొచ్చిన ఉద్యమం. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో ఇది మరోసారి తెరపైకి వచ్చింది. తాను జియోనిస్టునని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాజాగా ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment