ప్రస్తుతం మనమంతా 2024 చివరి నెల డిసెంబర్‌లో ఉన్నాం. త్వరలో ప్రపంచం కొత్త సంవత్సరంలోకి ప్రవేశించనుంది. రాబోయే సంవత్సరం కొత్త ఆశలు రేకెత్తిస్తే, గడచిన సంవత్సరం ఎన్నో పాఠాలను అందించింది. ప్రజలంతా నూతన సంవత్సరాన్ని స్వాగతించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో 2024లో జరిగిన ప్రముఖ ఘటనలను ఒకసారి నెమరువేసుకుందాం.
జనవరి 2024 నుండి డిసెంబర్ 2024 వరకు దేశంలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది రియాసీలో జరిగిన సైన్యంపై ఉగ్రదాడి , కోల్‌కతా అత్యాచారం కేసు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాగే వయనాడ్ కొండచరియలు వినాశనానికి కారణంగా నిలిచాయి. ఇదేవిధంగా దేశంలో చోటుచేసుకున్న 10 ప్రధాన సంఘటనలను ఒకసారి గుర్తుచేసుకుందాం.
1. రామ మందిర ప్రారంభోత్సవం
2024, జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ బాలరాముడు గర్భగుడిలో కొలువయ్యాడు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. దీనిని చూసేందుకు దేశంలోని పలువురు ప్రముఖులు అయోధ్యకు తరలివచ్చారు.
2. ఇన్సాట్-3డిఎస్ ఉపగ్రహ ప్రయోగం
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇస్రో.. దేశంలోనే అత్యంత అధునాతన ఉపగ్రహం ఇన్సాట్-3డీఎస్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్ నుంచి ఇస్రో దీనిని ప్రయోగించింది.
3. ఎయిర్ ఇండియా సిబ్బంది సమ్మె
ఈ ఏడాది మేలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగం సమ్మెకు దిగింది. దీంతో రెండు రోజుల్లో 170కి పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
4. నీట్ వివాదం
జూన్ 4న విడుదలైన నీట్ (యూజీ) 2024 ఫలితాలపై వివాదం నెలకొంది. ఈ పరీక్షలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వచ్చాయి. నిజానికి ఎన్‌టీఏ ఈ ఫలితాలను జూన్ 4న విడుదల చేసింది. అయితే అంతకుమందు ఎన్‌టీఏ ఈ ఫలితాలను విడుదల చేసే తేదీని జూన్ 14గా ప్రకటించింది. ఇదొక్కటే కాదు పరీక్షలో 720 మార్కులకు 720 మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య ఈసారి 67కి పెరిగింది. ఇది అనుమానాలకు తావిచ్చింది. టాప్ ర్యాంకులు సాధించిన వారిలో ఎనిమిదిమంది విద్యార్థులు హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాయడం విశేషం.
5 నెట్ పరీక్ష రద్దు
నీట్ పరీక్షకు సంబంధించిన వివాదం కొనసాగుతున్న తరుణంలోనే విద్యా మంత్రిత్వ శాఖ యూజీసీ నెట్-2024ను రద్దు చేయాలని నిర్ణయించింది. పరీక్షలో అవకతవకలు బయటపడటంతో పరీక్షను రద్దు చేశారు. తాజాగా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్ష జూన్ 18న జరిగింది. 11 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
6. రియాసిలో సైన్యంపై దాడి
2024, జూన్ 9న జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. దీనిలో తొమ్మిది మంది మృతిచెందారు. 33 మంది గాయపడ్డారు. శివ్ ఖోడి ఆలయం నుంచి కత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్తున్న ఈ బస్సుపై దాడి జరిగింది.
7. వయనాడ్ విలయం
ఈ ఏడాది జూలై 30న కేరళలోని వయనాడ్‌లో భారీ వర్షాల కారణంగా నాలుగు వేర్వేరు ప్రదేశాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. నాలుగు గ్రామాలు ధ్వంసమయ్యాయి. ఇళ్లు, వంతెనలు, రోడ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 80 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా జనం గల్లంతయ్యారు.
8. కోల్‌కతా అత్యాచారం కేసు
కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ మహిళా డాక్టర్ మృతదేహాన్ని ఆగస్టు 9 రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి శరీరంపై గాయాలైన గుర్తులు కనిపించాయి. డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
9. బాబా సిద్ధిఖీ హత్య
2024 అక్టోబర్ 12న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఎన్‌సీసీ నేత బాబా సిద్ధిఖీపై ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కేసులో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. బాబా సిద్ధిఖీ హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ హస్తం ఉందని సమాచారం. సల్మాన్ ఖాన్‌తో బాబా సిద్ధిఖీకి మంచి సంబంధాలు ఉన్నాయి.
10. లోయలో పడిన బస్సు
ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఒక బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 36 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. బస్సులో కెపాసిటీ కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Year Ender 2024: హృదయాలను దోచిన ఐదు పర్యాటక ప్రాంతాలు
Comments
Please login to add a commentAdd a comment