సర్ గంగా రాం హాస్పిటల్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిండుకుంటున్న ఆక్సిజన్ నిల్వలు కోవిడ్ రోగులతో పాటు.. వారి కుటుంబసభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దేశ రాజధానిలో పరిస్థితి మరీ భయంకరంగా ఉంది. ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన సర్ గంగా రాం ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో గడిచిన 24 గంటల్లో కోవిడ్‌తో తీవ్రంగా బాధపడుతున్న 25 మంది రోగులు మృతి చెందారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాక ‘‘ఆస్పత్రిలో కేవలం మరో రెండు గంటలకు సరిపడా మాత్రమే ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయి.. సుమారు 60 మంది రోగులు పరిస్థితి విషమంగా ఉంది. ఆక్సిజన్ అత్యవసరం’ అంటూ ఆస్పత్రి వర్గాలు ట్వీట్ చేశాయి. అంతేకాక ఢిల్లీ ప్రభుత్వానికి ఎస్‌ఓఎస్ పంపాయి. ఒకే రోజు 25 మంది మరణించడం ఆస్పత్రి చరిత్రలో ఇదే ప్రథమం అని యాజమాన్యం వెల్లడించింది.
సర్ గంగా రాం హాస్పిటల్ యాజమాన్యం ఎస్‌ఓఎస్ పంపిన 2 గంటల వ్యవధిలో ఆక్సిజన్ ట్యాంకర్ ఆస్పత్రి వద్దకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్విట్టర్‌లో షేర్ చేసింది. సర్ గంగా రాం ఆస్పత్రి ఢిల్లీలో ప్రసిద్ది చెందిన ప్రైవేట్ హాస్పిటల్. ఇక్కడ 500 మంది కంటే ఎక్కువ మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 142 మందికి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అవసరం ఉన్నట్లు సమాచారం.
25 sickest patients have died in last 24 hrs at the hospital. Oxygen will last another 2 hrs. Ventilators & Bipap not working effectively. Need Oxygen to be airlifted urgently. Lives of another 60 sickest patients in peril: Director-Medical, Sir Ganga Ram Hospital, Delhi
— ANI (@ANI) April 23, 2021
గత మూడు రోజులుగా పలు ఆస్పత్రులు ఆక్సిజన్, బెడ్ల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. దాంతో పలువురు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు ‘‘ముందు ఆడగండి.. లేదంటే అప్పుగా పొందండి.. అది కూడా కుదరకపోతే దొంగతనం చేయండి’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ రోగుల పరిస్థితి రోజురోజుకీ విషమిస్తుండడంతో ఆక్సిజన్ అవసరమూ ఎక్కువవుతోంది. మరోవైపు కరోనా తీవ్రత తర్వాత కేంద్రం ఆక్సిజన్ సరఫరాను స్వయంగా చేపట్టింది. నేరుగా దిగుమతి చేసుకునేందుకు వీల్లేకుండా ఆయా రాష్ట్రాల అవసరాల మేరకు కేటాయింపులు జరుపుతోంది.
ఇందులో భాగంగా గురువారమే ఢిల్లీలోని ఆస్పత్రులకు కేంద్రం ఆక్సిజన్ సిలిండర్లు పంపింది. కానీ, ఆ నిల్వలు నేటితోనే పూర్తయ్యాయి. మరోవైపు హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ తమకు స్థానికంగా అవసరాలున్నాయని తమ రాష్ట్రం నుంచి ఆక్సిజన్ ఇచ్చేది లేదని తేల్చిచెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment