తమ ప్రాణాలను పణంగా పెట్టి సామాన్య ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసులను వివిధ అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. గడచిన ఐదేళ్లలో ఒక్క ముంబైలోనే 821 మంది పోలీసులు మృతి చెందినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని బట్టి సగటున రెండు, మూడు రోజులకు ఒక పోలీసు మృతి చెందుతున్నట్లు స్పష్టమవుతోంది. ముంబై నిత్యం వివిధ ఉగ్రవాద సంస్థల హిట్ లిస్టులో ఉంటుంది. ముంబైలో నివాసముంటున్న దాదాపు కోటిన్నర జనాభాకు రక్షణ కల్పించాలంటే పోలీసులకు ఒక సవాలుగా మారుతుంది.
సాధారణంగా పోలీసులపై నేరాలను నియంత్రించడం, శాంతి, భద్రతలు కాపాడటం, ట్రాఫిక్ నియమాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై దృష్టి సారించడం తదితర కీలక బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలను నేరవేర్చే ప్రయత్నంలో పోలీసులు తమ ఆర్యోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అదనంగా కొన్ని గంటలు విధులు నిర్వహించడం, పై అధికారుల ఒత్తిడి, సమయానికి భోజనం చేయకపోవడం, తగినంత విశ్రాంతి లభించకపోవడం వంటి కారణాలతో పోలీసులు వివిధ అనారోగ్యాల బారిన పడుతున్నారు.
ఇందులో ముఖ్యంగా గుండెపోటు, రక్తపోటు, మధుమేహం లాంటి అనారోగ్య సమస్యలతో ఐదేళ్లలో 821 మంది పోలీసులు మృత్యవాత పడ్డారు. ఇందులో అత్యధికంగా గుండెపోటుకు సంబంధించిన వేర్వేరు సమస్యలతో 168 మంది మృతి చెందారు. అదేవిధంగా కరోనా సమయంలో విధులు నిర్వర్తిస్తూ ముంబై పోలీసు శాఖకు చెందిన 123 మంది చనిపోయారు. ఇదే ఐదేళ్ల కాలవ్యవధిలో 31 మంది పోలీసులు ఆత్యహత్య చేసుకున్నారు.
అందుకు కుటుంబ కలహాలే ప్రధాన కారణం కాగా.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రెండో స్థానంలో ఉన్నాయి. ఇందులో కేన్సర్, కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులున్నాయి. ఆత్మహత్యల్లో ఉరేసుకోవడం, భవనం పైనుంచి దూకడం, సరీ్వసు రివాల్వర్‌తో కాల్చుకోవడం, రైలు కింద పడటం లాంటి సంఘటనలున్నాయి.
చదవండి: డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్.. తెర వెనక సోనియా గాంధీ!
ఎప్పుడూ చర్చల్లోనే పోలీసులు..
ముంబై పోలీసుల ఆరోగ్య సమస్య అంశం ఎప్పుడూ చర్చల్లో ఉంటుంది. అయినప్పటికీ నిర్లక్ష్యం జరుగుతోంది. 2018 నుంచి 2023 ఏప్రిల్ వరకు ఏకంగా 821 మంది పోలీసులు వేర్వేరు అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడినట్లు అధికారికంగా లభించిన గుణంకాలు చెబుతున్నాయి. ముంబై నగరం ఎప్పుడు ఏదో కారణంతో బిజీగా ఉంటుంది. ఒకపక్క దేశ ఆర్థిక రాజధాని, మరోపక్క రాష్ట్ర రాజకీయాలకు ప్రధాన నిలయం కావడంతో తరుచూ వీఐపీల రాకపోకలు, రాజకీయ సభలు, సమావేశాలు, ప్రముఖుల భేటీ వల్ల వారికి బందోబస్తు కల్పించాల్సిన బాధ్యత ముంబై పోలీసులపై ఉంది.
అంతేగాకండా వివిధ మతాల పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు ఉంటాయి. దీంతో శాంతి, భద్రతలు అదుపు తప్పకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసుల వారాంతపు, దీర్ఘకాలిక సెలవులు రద్దు చేస్తారు. అలాగే పోలీసులకు రోజుకు ఎనిమిది గంటలు విధులు నిర్వహించాలనే ఆదేశాలున్నాయి. కానీ ప్రత్యక్షంగా అమలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. దీనికి తోడు ముంబై జనాభాతో పోలిస్తే పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో పోలీసులపై అదనపు భారం పడుతుంది. ఫలితంగా వారి ఆర్యోగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
మండే ఎండలూ కారణమే..
గత రెండు నెలల నుంచి ముంబైలో వేసవి ఎండలు మండిపోతున్నాయి. దీని ప్రభావం కూడా పోలీసుల ఆరోగ్యంపై పడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 43 మంది పోలీసులు వేర్వేరు అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఇందులో ఏడుగురు పోలీసులు డ్యూటీలో ఉండగానే మృత్యువాత పడ్డారు. పోలీసులు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు పోలీసు సంక్షేమ శాఖ తరఫున అనేక సేవా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ సంస్థల ద్వారా పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరాలు, వర్క్‌షాపులు జరుగుతుంటాయి.
కానీ అడపాదడపా చేపట్టడం వల్ల అనుకున్నంతమేర స్పందన రావడం లేదు. 2020–2022 కాలవ్యవధిలో ముంబైలోని ప్రముఖ టాటా కేన్సర్ ఆస్పత్రి 2,738 మంది పోలీసులకు కేన్సర్ పరీక్షలు నిర్వహించింది. 2023, ఫిబ్రవరిలో 15 రోజులపాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయగా అందులో కేవలం 325 మంది పోలీసులు పాల్గొన్నారు. అదే నెలలో యునైటెడ్ వే తరఫున ఫస్ట్ ఎయిడ్ అంశంపై శిక్షణ శిబిరం జరిగింది. సుమారు 45 వేల మంది ముంబై పోలీసుల కోసం చేపట్టిన ఈ శిబిరం సఫలీకృతం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment