![868 People Killed In floods In 11 States Says Govt - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/17/rain3.jpg.webp?itok=Vb38KwQz)
న్యూఢిల్లీ : దేశంలో గత వారం రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో జూలై చివర్లో నమోదైన వర్షపాత లోటును తుడిచిపెట్టేలా విస్తృతంగా వానలు కురుస్తున్నాయి. నాలుగు నెలల సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం దీర్ఘకాలిక సగటు కంటే అధికంగా 103% గా ఉంది. ఆగస్టు 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దీని వల్ల పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గతనెలలో కురిసిన వర్షాలతో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షభీబత్సం చాలామందిని బలిగొన్న సంగతి తెలిసిందే. కేరళలోనూ భారీ వర్షం కారణంగా కొండ చరియలు విరిగిపడి 55 మంది మరణించారు. (19న మరో అల్ప పీడనం: వాతావరణ శాఖ)
ఆగస్టు 12 నాటికి దేశంలోని 11 రాష్ర్టాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా 868 మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రిత్వ శాఖ నివేదికలో వెల్లడించింది. గత ఏడాది ఇదే సీజన్‌లో 908 మంది చనిపోయారు. ఈ సంవత్సరం కూడా అసాధారణమైన వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జైపూర్ లోని ఓ ప్రాంతంలో కేవలం ఆరు గంటల సమయంలోనే 25 సెం.మీ. వర్షం నమోదవగా , గత 24 గంటల్లో రాజస్తాన్,ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ర్టాల్లో భారీ వర్షాలు నమోదైనట్లు వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త ఆర్.కె. జెనమణి అన్నారు.ఆగస్టు నెలలోనే ఇప్పటివరకు మూడు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. హిమాలయాల నుంచి రుతుపవనాలు వేగంగా వీస్తున్నాయని దీంతో ఈశాన్య రాష్ర్టాల్లో భారీ వర్షాపాతం నమోదైనట్లు వెల్లడించారు.
గత కొన్ని వారాలుగా ఉత్తర అరేబియా సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే క్రమంగా పెరుగుతున్నాయి. దీని వల్ల భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం సంభవించే అవకాశం ఉందని తెలిపారు. జూన్ నెలలో 17.6% మిగులు లోటు, జూలై 9.7% లోటు వర్షపాతం నమోదవగా, ఆగస్టులో అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ నివేదించింది. గత కొన్ని రోజులుగా అత్యధికంగా ఛత్తీస్‌గడ్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అక్కడి భోపాల్‌పట్నం, భైరామ్‌ఘర్‌లలో వరుసగా 22, 32 సెం.మీల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతం నుంచి రుతుపవనాలు వేగంగా కదులుతున్నందున రాబోయే రెండు రోజుల్లో తుఫాను వచ్చే అవకాశం ఉందని అధికారులను అప్రమత్తం చేశారు. ఆగస్టు 18న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని వల్ల రాజస్తాన్, ఉత్తరాఖండ్, పంజాబ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ, గోవా, ఛత్తీస్‌గడ్, మహారాష్ర్టలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. (అలీగఢ్ బీజేపీ మాజీ మేయర్‌పై సంచలన ఆరోపణలు)
Comments
Please login to add a commentAdd a comment