బెంగాల్‌లో దీదీ.. తమిళనాడులో డీఎంకేకు పట్టం | ABP CVoter Opinion Poll: Mamata To Return With 158 Seats, BJP 102 | Sakshi
Sakshi News home page

ఆ ఐదు రాష్ట్రాల్లో గెలిచేదెవరు?

Published Tue, Jan 19 2021 1:09 AM | Last Updated on Tue, Jan 19 2021 1:42 PM

ABP CVoter Opinion Poll: Mamata To Return With 158 Seats, BJP 102 - Sakshi

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఏబీపీ(ఆనంద బజార్‌ పత్రిక) న్యూస్, సీ ఓటర్‌ సర్వే నిర్వహించింది. ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. 2021లో పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సర్వే ఫలితాలు ఇలా..

పశ్చిమబెంగాల్‌: రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. అధికారం నిలుపుకునేందుకు తృణమూల్‌ కాంగ్రెస్, రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. అయితే, పశ్చిమబెంగాల్‌ ఓటర్లు మళ్లీ దీదీ మమత వైపే మొగ్గు చూపుతున్నట్లు ఏబీపీ న్యూస్, సీ ఓటరు సర్వేలో తేలింది. 148 సీట్ల మేజిక్‌ ఫిగర్‌ను దాటి 158 స్థానాల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ గెలుపు సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. అయితే, 2016లో జరిగిన ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ 211 స్థానాల్లో గెలిచి, క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే.

ఈ సారి ఆ స్థాయి విజయం సాధ్యం కాకపోవచ్చని సర్వే పేర్కొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేనప్పటికీ.. గణనీయ సంఖ్యలో సీట్లను పెంచుకుంటుందని సర్వే తేల్చింది. గత ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గానూ 289 సీట్లలో పోటీ చేసి, మూడే స్థానాల్లో గెలిచిన బీజేపీ.. ఈ సారి 102 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. అధికార పక్షం నుంచి, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించినప్పటికీ.. మేజిక్‌ ఫిగర్‌కు బీజేపీ దూరంగానే నిలుస్తుందని ఈ సర్వేలో తేలడం విశేషం. కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్, వామపక్షాలు 30 సీట్లను గెల్చుకుంటాయని, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధిస్తారని తెలిపింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి 76 సీట్లు గెల్చుకున్నాయి. ముఖ్యమంత్రిగా మమత బెనర్జీకి రాష్ట్ర ప్రజలు మంచి మార్కులే వేశారు. 

కేరళ: కేరళలోనూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నాయకత్వంలో వామపక్ష కూటమి(ఎల్‌డీఎఫ్‌) అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వే తేల్చింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌– మే నెలల్లో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ 41.6 శాతం ఓట్లను, విపక్ష యూడీఎఫ్‌ 34.6% ఓట్లను, బీజేపీ 15.3% ఓట్లను సాధిస్తాయని సర్వేలో తేలింది. 2016 ఎన్నికల్లో మొత్తం 140 స్థానాలకు గానూ ఎల్‌డీఎఫ్‌ 91 సీట్లను, యూడీఎఫ్‌ 47 సీట్లను గెలుచుకున్నాయి. ఈ సారి ఎల్‌డీఎఫ్‌ 85 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని, యూడీఎఫ్‌ 53 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ ఒక స్థానంలో గెలుస్తుందని సర్వే పేర్కొంది. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌ 47% ప్రజాదరణతో విపక్ష కాంగ్రెస్‌ నేత ఊమెన్‌చాందీ(22%) కన్నా చాలా ముందున్నారు. 

తమిళనాడు: ఈ సారి ఎన్నికల్లో అధికార పక్షంపై వ్యతిరేకత గణనీయ ప్రభావం చూపనుంది. ఇది డీఎంకేకు అనుకూలంగా పరిణమిస్తుందని ఏబీపీ న్యూస్, సీ ఓటర్‌ సర్వే పేర్కొంది. అన్నాడీఎంకే, బీజేపీల అధికార ఎన్డీయే కూటమి ఈ ఎన్నికల్లో కేవలం 28.7% ఓట్లతో 98 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది. గత ఎన్నికల్లో ఈ కూటమి 43.7% ఓట్లతో 136 సీట్లు గెల్చుకుంది. డీఎంకే, కాంగ్రెస్‌ల యూపీఏ కూటమి 41.1% ఓట్లతో 162 సీట్లు గెల్చుకుని అధికారంలోకి వస్తుందని తేల్చింది. గత ఎన్నికల్లో ఈ కూటమి 39.4% ఓట్లు సాధించి 98 సీట్లు గెల్చుకుంది. ‘చిన్నమ్మ’శశికళ పార్టీ ‘అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం’గెలుపు సాధించలేకపోయినా, అన్నాడీఎంకే విజయావకాశాలను దెబ్బతీస్తుందని విశ్లేషించింది. కమల్‌ హాసన్‌ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేడని తేలింది. తమిళనాడులోని మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 234. 

పుదుచ్చేరి: 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పుదుచ్చేరిలో ఎన్‌డీఏ(ఏఐఎన్‌ఆర్‌సీ, బీజేపీ, ఏడీఎంకే) స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఏబీపీ న్యూస్‌ సర్వే తేల్చింది. 30 మంది సభ్యుల అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో ఎన్డీయే 16 సీట్లను, కాంగ్రెస్, డీఎంకేల సెక్యులర్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌(ఎస్‌డీఏ) 14 సీట్లను గెల్చుకుంటాయని తెలిపింది. గత ఎన్నికల్లో ఎస్‌డీఏ 17, ఎన్‌డీఏ 12 సీట్లలో విజయం సాధించాయి. 

అస్సాం: గత ఎన్నికల్లో 15 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనకు అంతం పలికి బీజేపీ చరిత్ర సృష్టించి, రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో మొత్తం 126 స్థానాలకు గానూ.. బీజేపీ, అస్సాం గణపరిషత్, బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ కూటమి 86 సీట్లు గెల్చుకుంది. ఇందులో బీజేపీ గెల్చిన స్థానాల సంఖ్య 60.  తరుణ్‌ గొగోయి నేతృత్వంలోని కాంగ్రెస్‌ 26 స్థానాల్లో గెల్చింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏదే విజయమని సర్వే తేల్చింది. 73 – 81 స్థానాల్లో ఎన్‌డీఏ, 36 – 44 సీట్లలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ గెలుస్తుందని పేర్కొంది.  

పశ్చిమబెంగాల్‌: మళ్లీ మమత వైపే పశ్చిమబెంగాల్‌ ఓటర్లు మొగ్గు. మొత్తం 294 స్థానాలకు గాను.. 158 స్థానాల్లో టీఎంసీ విజయం. గత ఎన్నికల్లో మొత్తం 3 స్థానాల్లోనే గెలిచిన బీజేపీ.. ఈ సారి 102 సీట్లు గెలుచుకుంటుంది. కాంగ్రెస్‌–వామపక్షాలు 30 చోట్ల విజయం. 
కేరళ: సీఎం పినరయి విజయన్‌ నాయకత్వంలో ఎల్‌డీఎఫ్‌ అధికారాన్ని నిలబెట్టుకుంటుంది. 140 స్థానాలకు గానూ ఎల్‌డీఎఫ్‌ 85 స్థానాల్లో విజయం సాధిస్తుంది. యూడీఎఫ్‌ 53 సీట్లు, బీజేపీ ఒక సీటు గెలుస్తుంది.
తమిళనాడు: ఈ సారి ఎన్నికల్లో అధికార పక్షంపై వ్యతిరేకత గణనీయ ప్రభావం చూపనుంది. ఇది డీఎంకేకు అనుకూలంగా పరిణమిస్తుంది. మొత్తం 234 స్థానాల్లో అన్నాడీఎంకే–బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో 98 సీట్లులో.. డీఎంకే–కాంగ్రెస్‌ కూటమి 162 సీట్లు గెల్చుకుంటుంది.
అస్సాం: బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏదే విజయం సాధిస్తుంది. మొత్తం 126 స్థానాలకు గాను 73 – 81 స్థానాల్లో ఎన్‌డీఏ, 36 – 44 సీట్లలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ గెలుస్తుంది. 
పుదుచ్చేరి: కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఎస్‌డీఏపై ఎన్‌డీఏ స్వల్ప మెజారిటీ సాధిస్తుంది. 30 మంది సభ్యుల అసెంబ్లీలో ఎన్డీయే 16 సీట్లను, ఎస్‌డీఏ 14 సీట్లను గెల్చుకుంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement