
న్యూఢిల్లీ: నిరసనలను చల్లార్చేందుకు అగ్నిపథ్ పథకానికి కేంద్రం మార్పుచేర్పులు చేసింది. నాలుగేళ్ల సర్వీసు అనంతరం బయటికొచ్చే అగ్నివీరుల్లో అర్హులకు రక్షణ శాఖ ఖాళీల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శనివారం ఆమోదముద్ర వేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివీలియన్ పోస్టులతో పాటు రక్షణ శాఖ పరిధిలోని 16 ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. అలాగే సెంట్రల్ ఆర్మ్‌డ్ పారా మిలటరీ ఫోర్స్ (సీఏపీఎఫ్), అసోం రైఫిల్స్‌లో కూడా అగ్నివీర్‌లకు 10 శాతం కోటా కల్పించే ప్రతిపాదనకు కేంద్ర హోం శాఖ కూడా ఆమోదముద్ర వేసింది. అంతేగాక వారికి గరిష్ట వయోపరిమితిని మూడేళ్లు పెంచింది.
అగ్నిపథ్ నియామకాలకు ఈ ఏడాది గరిష్ట వయో పరిమితిని ఇప్పటికే రెండేళ్లు పెంచడం తెలిసిందే. ఆ లెక్కన తొలి బ్యాచ్ అగ్నివీర్‌లకు సీఏపీఎఫ్, అసోం రైఫిల్స్‌లో నియామకాలకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుందంటూ హోం శాఖ ట్వీట్ చేసింది. వారికి మరిన్ని ఉపాధి కల్పన అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే చర్చలు జరిపింది.
పెట్రోలియం శాఖలోనూ అవకాశాలు
అగ్నివీరులను సర్వీసు అనంతరం హౌసింగ్, పెట్రోలియం శాఖల్లో తీసుకుంటామని ఆ శాఖల మంత్రి హరదీప్‌సింగ్ పురీ చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే అగ్నివీరులకు పలు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రకటించాయి. పోలీసు, సంబంధిత సర్వీసుల్లో వారికి ప్రాధాన్యమిస్తామని యూపీ, మధ్యప్రదేశ్, అసోం పేర్కొన్నాయి.
అద్భుత పథకం: కేంద్రం
మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి హామీ ఎక్కడుంది: రాజ్‌నాథ్
అగ్నిపథ్‌ను కేంద్రం గట్టిగా సమర్థించింది. మాజీ సైనికాధికారులు తదితరులతో రెండేళ్ల పాటు విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరమే ఏకాభిప్రాయంతో పథకానికి రూపకల్పన చేసినట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. పథకంపై దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో శనివారం ఆయన సమీక్ష జరిపారు. ‘‘సైనిక నియామక ప్రక్రియలో అగ్నిపథ్ విప్లవాత్మక మార్పులు తెస్తుంది. రాజకీయ అవసరాల కోసం కొందరు దీనిపై అపోహలు వ్యాప్తి చేస్తున్నారు. దాంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. నాలుగేళ్ల తర్వాత బయటికొచ్చాక ఉపాధి హామీ లేదనడం సరికాదు. లక్షలు పెట్టి మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుతున్న యువతకు కూడా ఉపాధి హామీ లేదు కదా!’’ అన్నారు.
వారికి సైనికోద్యోగాలు రావు
హింసాత్మక నిరసనలకు పాల్పడే వారికి సైనికోద్యోగాలకు దారులు శాశ్వతంగా మూసుకుపోతాయని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి అన్నారు. కేసుల్లో ఇరుక్కుంటే పోలీస్ క్లియరెన్సులు రావన్నారు.
Comments
Please login to add a commentAdd a comment