కొచ్చి: కొద్ది రోజులుగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి అత్యవసరంగా కిందకు దింపాల్సిన సంఘటనలు పెరిగిపోయాయి. ఏ క్షణంలో ఏమి జరుగుతుందోననే భయంతో ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజాగా దుబాయ్ నుంచి కేరళలోని కొచ్చికి వస్తున్న ఎయిరిండియా విమానంలో సమస్య తలెత్తింది. క్యాబిన్‌లో ప్రెజర్ తగ్గటం వల్ల విమానాన్ని ముంబైకి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడినట్లు సమాచారం. అయితే.. ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా కిందకు దించారు. ఈ సంఘటన గురువారం జరిగింది. ముంబయి నుంచి మరో విమానంలో ప్రయాణికులను కొచ్చికి శుక్రవారం ఉదయం చేర్చారు.
దుబాయి నుంచి కేరళలోని కొచ్చికి వస్తున్న ఎయిరిండియా విమానంలో సంకేతిక సమస్య తలెత్తిన ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ). ‘దుబాయి నుంచి కొచ్చికి వస్తున్న ఎయిరిండియా బోయింగ్ విమానం ఏఐ-934 కెప్టెన్.. క్యాబిన్‌లో ప్రెజర్ తగ్గిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడినట్లు ఐఓసీసీకి సమాచారం అందించారు. విమానాన్ని ముంబైకి మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేశాం.’ అని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇద్దరు సీనియర్ అధికారులను దర్యాప్తునకు నియమించినట్లు చెప్పారు.
గత బుధవారం.. ఢిల్లీ నుంచి గువాహటికి వస్తున్న గోఎయిర్ విమానం విండ్‌షీల్డ్ పగిలిన సంఘటన కలకలం సృష్టించింది. ఆ తర్వాత గోఎయిర్ విమానాన్ని జైపూర్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈనెలలోనే ఇలాంటివి రోజుకు 30 సంఘటనలు చోటు చేసుకున్నట్లు తాజాగా డీజీసీఏ తెలిపింది. అయితే.. ఎలాంటి నష్టం వాటిల్లలేదని వెల్లడించింది. ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: ‘సార్ నా బ్యాగులో బాంబు ఉంది..’ ఇండిగో విమానంలో ప్యాసింజర్ హల్‌చల్
Comments
Please login to add a commentAdd a comment