లక్నో: ఒక్కోసారి కోర్టుకు కొన్ని వింత కేసులు వస్తుంటాయ్. తాజాగా అలాంటి ఓ కేసు ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు ముందుకు వచ్చింది. ఆజంగఢ్‌కు చెందిన ఓ 16 ఏళ్ల బాలుడికి ఓ మేజర్ యువతితో వివాహమైంది. కాగా బాలుడు ఎవరితో ఉండాలనే విషయంపై అతడి తల్లి, భార్య మధ్య తలెత్తిన వివాదం అలహాబాద్ హైకోర్టు వరకు వెళ్లింది. మరి ఇటువంటి వింత కేసుకు కోర్టు ఎలా స్పందించిందో చూద్దాం.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని అజంగఢ్లో ఉంటున్న ఓ మైనర్ బాలుడు తన కన్నా వయసులో పెద్దదైన యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లి తన కొడుకును తన వద్దకు పంపించాలని కోరుతూ గతేడాది అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్18, 2020 జరిగిన విచారణలో న్యాయమూర్తి బాలుడి అభిప్రాయాన్ని తెలపాలని అడగగా.. తాను ఇష్టపడే ఆమెను పెళ్లి చేసుకున్నట్లు అంగీకరిస్తూ తనకు పెళ్లామే కావాలని కోరాడు.
అదే క్రమంలో తన తల్లితో వెళ్లేందుకు నిరాకరించాడు. కేసు తిరిగి ఈ ఏడాది మే 31న విచారణలో.. మైనర్ బాలుడు మేజర్ యువతితో వివాహం చట్ట ప్రకారం చెల్లదు. ప్రస్తుతం ఆ బాలుడికి మైనార్టీ తీరకపోవడంతో అతడిని 2022 ఫ్రిబ్రవరి 24 వరకు ప్రభుత్వ షెల్టర్ హోం నందు ఉంచాలని కోర్టు తీర్పునిచ్చింది. బాలుడికి మైనార్టీ తీరాక అతని ఇష్టం ప్రకారం ఎవరితోనైనా ఉండోచ్చని స్పష్టం చేసింది. కాగా ఆ బాలుడు ఇటీవలే తండ్రి కూడా అయ్యాడు.
చదవండి: సంచలనం: గంగానదిలో కొట్టుకొచ్చిన శిశువు, సర్కార్ స్పందన
Comments
Please login to add a commentAdd a comment