
విడుదలకు ముందే వివాదాలను మూటగట్టుకుంది కేరళ స్టోరీ’ చిత్రం.. ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై వివాదాలు చినికి చినికి గాలివానలా మారాయి. కేరళలోని అధికార ప్రభుత్వంతోపాలు పలు విపక్షాలు సైతం ఈ చిత్రంపై విమర్శల స్వరం వినిపిస్తున్నాయి. సీఎం పినరయి విజయన్ సైతం సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ది కేరళ స్టోరీ రాజకీయ ప్రకంపనలకు కేంద్ర బిందువుగా మారింది.
తాజాగా ఈ పంచాయితీ న్యాయస్థానం వరకు చేరింది. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ది కేరళ స్టోరీ విద్వేషపూరితంగా చీత్రికరించారని, సినిమా విడుదల చేస్తే సమాజంలో మత సామరస్యాలు దెబ్బతింటాయంటూ పిటిషన్‌లో ఆరోపించాయి. అయితే సుప్రీంకోర్టులో ది కేరళ స్టోరీకి భారీ ఊరట లభించింది. సినిమా రిలీజ్‌పై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
చదవండి: The Kerala Story: నిరూపిస్తే కోటి రూపాయలు!
సినిమా విడుదలకు ఇప్పటికే సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. కావాలంటే పిటిషనర్లు సినిమా సర్టిఫికేషన్‌ను సవాల్ చేస్తూ సంబంధిత అధికారులను ఆశ్రయించవచ్చని సుప్రీం సూచించింది. జస్టిస్ కేఎమ్ జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, నిజాం పాషాల తమ వాదనలు వినిపించారు. అయితే ద్వేషపూరిత ప్రచారం వంటి కేసుతో సినిమాను కలపలేమని.. మూవీ విడుదలపై స్టే కోరడానికి ఇది సరైన కారణం కాదని తెలిపింది.
ముందు హైకోర్టుకు వెళ్లండి
ఇందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన అవసరంలేదని సర్టిఫికేషన్ బోర్డు లేదా హైకోర్టుకు వెళ్లవచ్చని తెలిపింది. అయితే హైకోర్టుకు వెళ్లే సమయం లేదని సినిమా శుక్రవారం విడుదలవుతుందని అందుకే సుప్రీంకోర్టు తలుపు తట్టినట్లు అడ్వకేట్ నిజాం పాషా చెప్పారు. పాషా వాదనలను ధర్మాసనం తిరస్కరించింది. ఈ విషయంపై ముందుగా సంబంధిత హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతించిందని గుర్తుచేసింది. చిత్రం సర్టిఫికేషన్ ప్రక్రియ ద్వారా వెళ్ళిందని.. సర్టిఫికేషన్‌ను సవాలు చేస్తే తప్ప, బెంచ్ ఏమీ చేయలేదని చెప్పింది.
చదవండి: ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా
సినిమా నేపథ్యం ఇదీ
సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. విపుల్ అమృత్‌లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఐసిస్‌లో చేరి ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ది కేరళ స్టోరీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఏప్రిల్ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడంతో మే5న విడుదలకు సిద్ధంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment