
ఢిల్లీ: ఉత్తర భారతంలో వడగాల్పులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఎండల తీవ్రతకు మరణాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. వడగాల్పులపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా రాష్ట్రాలకు ఐదుగురు సభ్యుల బృందాన్ని పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.
వడగాల్పుల తీవ్రత నుంచి బయటపడటానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇప్పటికే తగు సూచనలు చేసినట్లు చెప్పారు. ప్రజలను రక్షించడానికి కావాల్సిన తగు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వడదెబ్బతో ఎవరూ మరణించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఉత్తరప్రదేశ్, బిహార్, హర్యానా తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో విపరీతంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గత కొన్ని రోజులుగా దేశంలో వడగాల్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. చాలా రాష్ట్రాల్లో మోతాదుకు మించి ఎండలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మూడు రోజుల్లోనే ఒకే జిల్లాలో 54 మంది మృతి చెందారు. 400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశాల్లో ఎండల దృష్ట్యా వేసవి సెలవులను కూడా ప్రభుత్వం పొడిగించింది.
ఇదీ చదవండి: రాజకీయ వివాదాల నడుమ.. ‘అందరికీ ఉచితంగా గుర్బానీ’ బిల్లు ఆమోదం