
ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఐదోసారి సమన్లు జారీ చేసింది ఈడీ. దీంతో..
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి సమన్లు జారీచేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇవాళ ఈడీ ఐదోసారీ సమన్లు ఇచ్చింది. ఇప్పటివరకూ ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరుకాని విషయం తెలిసిందే.
లిక్కర్ కేసులో మొదటిసారి ఆయన నవంబర్ 2వ తేదీన సమన్లు ఇచ్చింది ఈడీ. ఆపై డిసెంబర్ 21న రెండోసారి, జనవరి 3వ తేదీన మూడోసారి, జనవరి 13వ తేదీన నాలుగోసారి సమన్లు జారీ చేసింది. అయితే పార్టీ వ్యవహారాల పేరిట ఆయన విచారణకు డుమ్మా కొడుతూ వస్తున్నారు. తాజాగా ఐదోసారి నేడు జారీ చేసిన సమన్లలో ఫిబ్రవరి 2వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ కోరింది. ఈసారి గనుక ఆయన హాజరు కాకుంటే.. అరెస్ట్ వారెంట్ కోసం ఈడీ కోర్టును ఆశ్రయించవచ్చు.
మరోవైపు తొలి నుంచి ఆయన ఈడీ నోటీసులను బీజేపీ ప్రతీకార రాజకీయ చర్యగా.. సార్వత్రిక ఎన్నికల ముందు జరుపుతున్న కుట్రగా అభివర్ణిస్తూ వస్తున్నారు. అయితే ఇందులో ప్రతీకార రాజకీయాలాంటిదేం లేదని.. మాత్రం దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛగా తమ పని తాము చేసుకుంటున్నాయని బీజేపీ చెబుతోంది.