పోలాండ్ చిన్నారులు- దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా
రష్యా దురాక్రమణతో ఉక్రేనియన్లు లక్షలాదిగా శరణార్ధులవుతున్న దృశ్యాలు చూస్తున్నాం! ప్రాణాలరచేతిలో పెట్టుకొని వచ్చిన ఉక్రేనియన్లకు పోలాండ్, రొమేనియా, హంగరీ, స్లొవేకియా తదితర దేశాలు సరిహద్దులు తెరిచి ఆశ్రయమిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో మానవ సంక్షోభం తలెత్తలేదని నిపుణులు వర్ణిస్తున్నారు.
ఇలాంటి సందర్భమే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పలు యూరప్ దేశాలకు ఎదురైంది. ఆ సమయంలో వారికి నేనున్నానంటూ ఒక భారత మహారాజు అక్కున చేర్చుకున్నారు. అనాథలమైపోయామని బాధ పడొద్దంటూ ఆయన యుద్ధ శరణార్ధులకు ఆశ్రయం కల్పించారు. ముఖ్యంగా హిట్లర్ దురాక్రమణతో కకావికలమైన పోలాండ్‌కు ఆ మహారాజు అండగా నిలిచారు. పోలాండ్ చిన్నారులకు ఒక తండ్రిలా మారారు.
నిజానికి ఆ సమయంలో భారత్‌లో బ్రిటిష్ పాలన నడుస్తోంది. సొంత ఖండానికి చెందిన వారే అయినా పోలాండ్ శరణార్ధులను అనుమతించకూడదని భారత్‌లో బ్రిటిష్ అధికారులు నిర్ణయించుకున్న సమయంలో మహారాజా దిగ్విజయ్‌సింహ్‌జీ రంజిత్‌సింహ్‌జీ జడేజా వారికి ఆశ్రయం ఇచ్చి మనసున్న మారాజని నిరూపించుకున్నారు. గుజరాత్‌లోని నవానగర్ సంస్థానాధిపతైన దిగ్విజయ్ సింహ్‌జీని ప్రజలు గౌరవంగా జామ్‌సాహెబ్ అని పిలుస్తారు.
నన్ను మీ బాపూ అనుకోండి!
1942లో సోవియట్ సైన్యం పోలాండ్ పైకి వచ్చినప్పుడు 2 నుండి 17 ఏళ్ల మధ్య వయసున్న 600 మందికి పైగా పిల్లలని ఒక నౌకలో ఎక్కించి శరణార్థులుగా పంపించారు. వీళ్లకు ఎవరూ ఆశ్రయమివ్వలేదు. చివరకు భారత్‌లో వలస పాలకులు కూడా శరణార్థుల సాయానికి ఆటంకాలు కల్పించారు.
యుద్ధం కారణంగా అనాథలైన పోలాండ్ పిల్లల వెతలు చూసి జామ్‌సాహెబ్ చలించిపోయారు. బ్రిటీష్ అధికారుల ఆటంకాలు లెక్కచేయకుండా పోలండ్ పిల్లల ఓడను తన రాజ్యంలోని రోసి పోర్టుకు ఆయన ఆహ్వానించారు. అక్కడకు సమీపంలోని బాలచడి నగర సరిహద్దుల్లో పోలండ్ శరణార్ధుల కోసం కుటీరాలు ఏర్పాటు చేయించారు. ‘‘నన్ను మీ బాపూ (తండ్రి) అనుకోండి! మీకు ఏ లోటూ రాదు’’ అని వారికి అభయం ఇచ్చారు.
యుద్ధం కారణంగా ఇల్లూ వాకిలి వదిలిన పోలండ్ వాసులు సొంతింట్లో ఉన్న భావన కలిగించాలని ఆయన అనేక సదుపాయాలు కల్పించారు. దాదాపు 640 మంది శరణార్ధులు మహారాజు వద్ద ఆశ్రయం పొందారు. ఆ తర్వాత 1946 లో వారిని తిరిగి పోలాండ్ పంపించారు.
శరణార్ధులకూ హక్కులుంటాయి!
శరణార్ధుల్లో ఒకరు జామ్‌సాహెబ్ ఆతిథ్యం గురించి చెబుతూ ‘‘ఆ సమయంలో మాకు పునరావాస కేంద్రాల్లో ఇస్తున్న ఉడికించిన పాలకూర నచ్చలేదు. దీంతో స్ట్రయిక్ చేద్దామని నిర్ణయించుకున్నాం! ఈ విషయం బాపూ (జామ్‌సాహెబ్) కు తెలిసింది. వెంటనే వంటగాళ్లకు ఆ కూర వండవద్దని ఆదేశించారు.
నిజానికి శరణార్ధులుగా ఉన్న మాకు డిమాండ్లు చేసే హక్కుంటుందని మేం భావించలేదు. కానీ ఆయన అతిచిన్న విషయంలో కూడా మాకు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు’’ అని తెలిపారు. పొలండ్, పోలిష్ రిపబ్లిక్ గా ఏర్పాటు అయిన తర్వాత ‘కమాండర్స్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్‘ అవార్డును ఆయనకు ప్రకటించింది.
ఇప్పటికీ పోలండ్‌వాసులు మహారాజా పెద్ద మనసును మరిచిపోలేదు. ఆయన ఆశ్రయం పొంది అనంతరం పోలండ్ తిరిగివెళ్లిన వాళ్లు ‘సర్వైవర్స్ ఆఫ్ బాలచడి’’ పేరిట బృందంగా ఏర్పడ్డారు. జామ్‌సాహెబ్‌కు ఆజన్మాంతం తామంతా రుణపడ్డామని వీళ్లు చెప్పేవాళ్లు. తమ కృతజ్ఞతకు గుర్తుగా వార్సాలో ఆయన పేరిట స్క్వేర్ ఆఫ్ గుడ్ మహారాజా అని ఒక కూడలి ఏర్పాటు చేసుకున్నారు. 2014లో అక్కడ ఒక పార్కు కూడా ప్రారంభించారు. అందులో ఆయన స్మారక చిహ్నం స్థాపించారు.
ఎవరీ మారాజు?
జామ్ సాహెబ్‌గా ప్రసిద్ధి చెందిన రాజా దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా (1895–1966) యదువంశీ రాజ్‌పుత్ వంశానికి చెందినవారు. ప్రఖ్యాత క్రికెటర్ రంజిత్‌సింగ్‌జీ ఈయనకు మేనమామ. యూనివర్సిటీ కాలేజ్ లండ¯Œ లో విద్యాభ్యాసం చేశారు. 1919లో బ్రిటిష్ ఆర్మీలో సెకండ్ లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. 1947 వరకు లెఫ్టినెంట్–జనరల్ గా బ్రిటీష్‌ఇండియన్ ఆర్మీ నుంచి గౌరవ భృతి పొందారు. 1935లో ఆయనకు మహా రాజకుమారి బైజీ రాజ్ శ్రీ కంచన్ కున్వెర్బా సాహిబాతో వివాహమైంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నవానగర్‌ను యునైటెడ్ స్టేట్ ఆఫ్ కతియావార్‌లో విలీనం చేశారు.
– శాయి ప్రమోద్
Comments
Please login to add a commentAdd a comment