భారత్‌లో వ్యాపార నిమిత్తం అడుగుపెట్టిన పరాయి దేశస్థులు దక్షిణ భారతంలో మొదట పట్టు సాధించారు. ఈ క్రమంలో వీరి పోకడలను వ్యతిరేకిస్తూ పలువురు విముక్తి పోరాటాలు చేశారు. అయితే భారతీయులంతా సంఘటితంగా తొలిసారి పోరాడింది 1857 తొలి స్వాతంత్య్ర సంగ్రామం లోనే! ఈ తొలి సంగ్రామం కన్నా ముందు నుంచే వేర్వేరు ప్రాంతాల్లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సామాన్యుల నుంచి మహారాజుల వరకు తమకు సాధ్యమైన రీతిలో స్వేచ్ఛ కోసం పోరాడారు.
అలా తమిళనాట బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా 1780 ల్లోనే మహారాణి వేలునాచియార్ వీర పోరాటం చేశారు. క్రూరమైన ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన తొలి భారతీయ రాణిగా వేలు నాచియార్ ఖ్యాతిగాంచారు. ఆమె వీరత్వానికి, సాహసానికి గుర్తుగా తమిళులు ఆమెను వీరమంగై (వీరవనిత) అని కీర్తించారు.
ఆర్కాట్ నవాబు మోసం
తమిళనాడులోని రామ్‌నాడ్ రాజ్యానికి చెందిన రాణి సకందిముతల్‌కు, చెల్లముత్తు విజయరఘునాథ సేతుపతి మహారాజుకు 1730లో రాణి వేలు నాచియార్ జన్మించారు. మగ సంతతి లేకపోవడంతో నాచియార్‌ను రాజుగారు మగపిల్లాడిలా పెంచారు. ఆమెకు అన్నిరకాల విద్యలతో పాటు ఖడ్గయుద్ధ రీతులను, దండాయుధ పోరాట విధానాలను నేర్పారు. వీటితో పాటు భారతీయ రణవిద్యలైన వలరి, సిలంబం వంటివాటిలో నాచియార్ నైపుణ్యం సాధించారు. విలువిద్యలో, అశ్వవిద్యలో ఆమెకు సాటిలేరు. రాణిగా రాణించాలంటే కేవలం స్థానిక భాషపై పట్టు ఉంటే సరిపోదని భావించిన రాజుగారు తన కూతురుకు ఉర్దూ, ఫ్రెంచ్, ఇంగ్లీష్ నేర్పించారు.
1746లో నాచియార్‌కు శివగంగ సంస్థానాధిపతి రాజా ముత్తువదుగనతపెరియ ఉదయతేవర్‌తో వివాహమైంది. వీరికి ఒక కూతురు జన్మించింది. అయితే నాచియార్ వైవాహిక జీవితం మూణ్నాళ్ల ముచ్చటైంది. అప్పటి ఆర్కాట్ నవాబు బ్రిటిషర్లతో చేతులు కలిపి స్వదేశీ సంస్థానాలపై విరుచుకు పడ్డాడు. శివగంగ సంస్థానంపై నవాబు భారీగా పన్నులు విధించి వసూలు చేయడానికి ఈస్టిండియా కంపెనీ అధికారులను పంపాడు. అయితే రాజా ఉదయ్‌తేవర్ ఈ పన్నులను వ్యతిరేకించారు.
1772 యుద్ధంలో బ్రిటిషర్లు, ఆర్కాట్ నవాబు కలిసి అతడిని హతమార్చారు. దీంతో కూతురు వెలాచ్చితో కలిసి నాచియార్ విరుపాచ్చికి చెందిన పలయకారర్ గోపాల నాయకర్ వద్ద ఎనిమిదేళ్లు ఆశ్రయం పొందారు. నాచియార్, ఆమె దండనాయకులను గోపాల్ ఎంతగానో ఆదరించాడు. ఈ సమయంలో తిరిగి సంస్థానం స్వాధీనం చేసుకోవడం గురించి రాణి నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారు.
తొలి సూసైడ్ బాంబర్
1780లో ఆమెకు కాలం కలిసివచ్చింది. ఆర్కాట్ నవాబుకు వ్యతిరేకంగా హైదర్‌ఆలీ యుద్ధం ప్రకటించాడు. ఇదే అదనుగా శివగంగను స్వాధీనం చేసుకునేందుకు నాచియార్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆమెతో పాటు అనేకమంది మహిళా సైనికులు స్థానిక రాజరాజేశ్వరి ఆలయానికి విజయదశమి సందర్భంగా చేరుకున్నారు. అంతా పండుగ వేడుకల్లో ఉన్నప్పుడు రాణి ఒక్కమారుగా బ్రిటిషర్లపైకి దాడికి దిగారు. అయితే ఎంత వ్యూహాత్మకంగా ముందుకు కదిలినా.. బ్రిటిషర్ల ఆయుధ సంపత్తి అపారంగా ఉండడంతో రాణికి పోరాటం కష్టంగా మారింది. ఇదే సమయంలో రాణి మహిళా దళపతి కుయిలి మహా సాహసానికి ఒడిగట్టింది.
ఒంటి నిండా చమురు పోసుకొని ఆయుధగారం వద్దకు చేరుకున్న కుయిలీ తనను తాను కాల్చుకుంది. దీంతో భారీ విస్ఫోటనంతో ఆయుధాలన్నీ ధ్వంసమయ్యాయి. ఇలా చరిత్రలో తొలి సూసైడ్ బాంబర్‌గా కుయిలీ నిలిచింది. అంతకుముందు కూడా రాణి నాచియార్‌ను కుయిలీ పలుమార్లు కాపాడింది. కుయిలీని తన దత్తపుత్రికగా నాచియార్ పేర్కొనేవారు. అనంతర కాలంలో ‘ఉడైయాల్‘ అనే స్త్రీసేనను పోరాటంలో మరణించిన తన దత్తపుత్రిక పేరుతో స్థాపించారు నాచియార్. హైదర్‌ఆలీతో రాణి చేతులు కలిపిన సంగతి గ్రహించిన ఆర్కాట్ నవాబు చివరకు చేసేది లేక ఆమెకే శివగంగ సంస్థానాన్ని అప్పగించారు.
ఈ నేపథ్యంలో మరుదు సోదరులు, కూతురుతో కలిసి ఆమె శివగంగ ఆస్థానానికి తిరిగి వచ్చారు. వెల్లై మరుదును సేనాధిపతిగా, చిన్న మరుదును మంత్రిగా నియమించుకొని పాలన సాగించారు. తన ధైర్యసాహసాలతో వీరవనిత అనే నామాన్ని సార్ధకపరచుకొన్నారు నాచియార్. యుద్ధానంతరం క్రమంగా ఆమె మురుదు సోదరులకు పరిపాలనాధికారం అప్పగించారు. 1796లో నాచియార్ మరణించారు. ఆమె సాహసానికి గుర్తుగా నాచియార్‌ను ‘జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా‘ అని కీర్తిస్తారు.
– దుగ్గరాజు శాయి ప్రమోద్
(చదవండి: మార్గరెట్ బూర్కి–వైట్: తను లేరు, తనిచ్చిన లైఫ్ ఉంది)
Comments
Please login to add a commentAdd a comment