
ఈ ఆగస్టు 14కు భారత స్వాతంత్య్ర ‘అమృతోత్సవాలు’ పూర్తవుతున్నాయి. మన స్వతంత్రం 75 ఏళ్లు పూర్తి చేసుకుని ఆగస్టు 15న 76లోకి ప్రవేశిస్తోంది. ఈ సందర్భాన్ని దేశ ప్రజలు ఘనమైన వేడుకగా జరుపుకోవాలని ఆదివారం జూలై 31న ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఇంటింటా జాతీయ జెండా ఎగరాలని కోరారు. సోషల్ మీడియా అకౌంట్‌లలో మన త్రివర్ణ పతకాన్ని ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.
ఆగస్టు 2 నుంచి (నేటి నుంచి) 15 వ తేదీ వరకు ప్రొఫైల్ పిక్‌ను ఉంచుకోవాలని సూచించారు. ఆగస్టు 2కు ఉన్న ప్రాముఖ్యాన్ని చెబుతూ, జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య ఆగస్టు 2నే జన్మించారని మోదీ గుర్తు చేశారు. దేశం స్వాతంత్య్రం సాధించిన 75 ఏళ్లు పూర్తవుతున్న ఈ చరిత్రాత్మక సందర్భాన్ని ప్రత్యక్షంగా చూడగలగడం నేటి తరం చేసుకున్న అదృష్టం అని అన్నారు.
‘‘బానిసత్వ కాలంలో మనం జన్మించి ఉంటే మహోన్నతమైన ఇలాంటి ఒక రోజును ఆనాడు ఊహించగలిగి ఉండేవాళ్లమా?’’ అని ప్రశ్నిస్తూ.. ‘‘దేశ ప్రజలంతా నిబద్ధతతో, బాధ్యతల్ని గుర్తెరిగి మసులుకుంటూ, స్వాతంత్య్ర సమర యోధుల కలలను నిజయం చేసేందుకు వారి ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని నిర్మించుకోవాలన్నదే ఈ ఆజాదీ కా అమృతోత్సవ్ సందేశం’’ అని చెప్పారు. ఈ శుభ తరుణంలో ప్రతి ఒక్కరూ అమృతోత్సవాలలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని దేశ ప్రధాని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment