![Azadi Ka Amrit Mahotsav: Indira Gandhi National Emergency Declared In India - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/12/judge-jagmohan-sinha.jpg.webp?itok=1iqhwEvr)
ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదంటూ సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చిన అనంతరం కోర్టు హాలు నుంచి బయటికి వస్తున్న అలహాబాద్ హైకోర్టు జడ్జి జగ్‌మోహన్‌లాల్ సిన్హా (మధ్యలో)
జూన్ 12 జడ్జ్‌మెంట్
1971లో రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో రాజ్ నారాయణ్‌పై గెల్చిన ఇందిరాగాంధీ విజయాన్ని సవాలు చేస్తూ రాజ్‌నారాయణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై.. ఆమె ఎన్నిక చెల్లదని, తరువాత 6 సంవత్సరాల వరకు ఇందిరాగాంధీ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనరాదని అలహాబాదు హైకోర్టు జడ్జి జగ్‌మోహన్‌లాల్ సిన్హా 1975 జూన్ 12న తీర్పు ఇచ్చారు. దీనిపై ఇందిరాగాంధీ అత్యున్నత న్యాయస్థానంలో స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దాంతో ప్రతిపక్ష నాయకులు, ఆమె వ్యతిరేకులు కలిసి పెద్ద ర్యాలీని నిర్వహించాలని; పోలీసులను, అధికార యంత్రాంగాన్ని ఇందిరకు తమ అవిధేయతను తెలియజేయాల్సిందిగా కోరదలిచారు. ఈ సంగతిని పసిగట్టిన ఇందిర పరిస్థితిని చేజారనీయకుండా అదుపులోకి తీసుకురావాలని దేశంలో ఎమర్జెన్సీకి రంగం సిద్ధం చేశారు. అప్పటి అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని 352 వ ఆర్టికల్ ప్రకారం 1975 జూన్ 25న అత్యయిక స్థితిని ప్రకటించారు. జడ్జి జగ్‌మోహన్‌లాల్ సిన్హా ఆనాడు ఇచ్చిnన తీర్పు సాహసోపేతమైనదని ఇటీవల ఒక సందర్భంలో సీజేఐ రమణ ప్రశంసించారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఇందిర ఎన్నికను చెల్లకుండా చేసిన ఈ తీర్పు దేశంలో ఒక కుదుపు తెచ్చిందన్నారు. అక్కడి నుంచి అనేకమంది గొప్ప న్యాయవాదులు, న్యాయమూర్తులు వచ్చారన్నారు.
దీననాథ్ గోపాల్ టెండూల్కర్
రచయిత, డాక్యుమెంటరీ చిత్రాల దర్శకుడు. మహాత్మా గాంధీపై ‘లైఫ్ ఆఫ్ మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ’ అనే ఎనిమిది సంపుటాల గ్రంథాన్ని రాశారు. గాంధీజీకి సన్నిహిత అనుచరుడు, ఫిల్మ్ మేకర్ అయిన విఠల్‌భాయ్ జవేరీతో కలిసి ‘మహాత్మ : లైఫ్ ఆఫ్ గాంధీ, 1869–1948’ అనే డాక్యుమెంటరీని తీశారు. మహాత్మ గాంధీపై ఆయన గాంధీ ఇన్ చంపారన్, గాంధీజీ : హిజ్ లైఫ్ అండ్ వర్క్స్ అనే పుస్తకాలు కూడా రాశారు. దీననాథ్ 1972 జూన్ 12న మరణించారు. ఆయన జన్మస్థలం మహరాష్ట్రలోని రత్నగిరి.
Comments
Please login to add a commentAdd a comment