Bandu Loyal Dog Sacrifice Life In Mumbai Mall Fire Accident - Sakshi
Sakshi News home page

అందరి ‘బందు’వయ.. కన్నీళ్లు పెట్టిస్తున్న కుక్క త్యాగం, ఆ నిజాయితీని మళ్లీ తేగలమా?

Published Mon, Mar 7 2022 10:02 AM | Last Updated on Mon, Mar 7 2022 11:12 AM

Bandu Loyal Dog Sacrifice Life Mumbai Mall Fire Accident - Sakshi

బందు.. పక్కన దానిని ఖననం చేసిన చోటు

‘మనుషుల కంటే మూగజీవాలు ఎంతో నయం’.. ఈ మాట విన్నప్పుడల్లా అదేదో అతిశయోక్తితో చెప్తున్నారేమో అనుకుంటారు కొందరు. కానీ, అదే నిజమని పదే పదే కొన్ని ఘటనలు నిరూపిస్తూ వస్తున్నాయి. రోజూ పట్టెడు అన్నం పెడుతున్నారని కాపలాగా ఉండడమే కాదు, వాళ్లను ఆపద నుంచి రక్షించాలనే ఉద్దేశంతో ముందుకెళ్లిన ఓ మూగజీవి.. పాపం ప్రాణం పోగొట్టుకుంది. అందరితో కంటతడి పెట్టిస్తోంది ఈ ఘటన.


ముంబై భాందప్‌ ‘డ్రీమ్స్‌ మాల్‌’ దగ్గర ఓ కుక్క ఆరేళ్ల నుంచి ఉంటోంది. దానికి ఆ కాంప్లెక్స్‌లో ఉన్న దుకాణాల ఓనర్లు రోజూ అన్నం పెడుతుంటారు.  స్థానికులంతా దానిని ముద్దుగా ‘బందు’ అని పిల్చుకుంటారు. ఆ తర్వాత కొన్నాళ్లకు దానికి ‘బాలు’ అనే మరో కుక్క తోడైంది. ఈ రెండూ ఆ మాల్‌లో ఉన్న షాపులకు కాపలాగా ఉంటాయి. ఎవరైనా దొంగ చూపులు చూసుకుంటూ వెళ్లినా.. దొంగతనాలకు ప్రయత్నించినా మొరగడంతో పాటు వెంటపడి మరీ పట్టేసుకుంటాయి. మాల్‌కు వచ్చే వాళ్ల దొంగతనాలను సైతం ఎన్నోసార్లు అడ్డుకున్నాయి ఈ శునకాలు. అందుకే మళ్లీ వచ్చినప్పుడు వాటిని ఏమైనా తిండి పెట్టేవాళ్లు కూడా. 

దొంగల్ని గుర్తించడంలో బంధు ఎంతో స్మార్ట్‌.. అలాగే సెన్సిటివ్‌ కూడా. కిందటి ఏడాది ఆ మాల్‌లో ఉన్న ఓ నర్సింగ్‌ హోంలో ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగిందట. అది గుర్తించి గట్టి గట్టిగా మొరిగి అందరినీ అప్రమత్తంగా చేసింది బందునే. ఆ ఘటన తర్వాత ఈ రెండు కుక్కలు కొన్నాళ్లు దిగాలుతో తినడం సైతం మానేశాయట. 

తాజాగా శుక్రవారం ఈ మాల్‌లో మరోసారి ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. సెక్యూరిటీ గార్డులు సామాన్లను బయటకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బందు మాత్రం వాళ్లు ఆపదలో ఉన్నారేమో అనుకుని పొరబడింది. మొరుగుతూ లోపలికి పరిగెత్తింది. ఆ మంటల్లో చాలాసేపు ఉండేసరికి.. పొగకు ఉక్కిరి బిక్కిరి అయిపోయి స్పృహ కోల్పోయింది. అది గమనించిన సెక్యూరిటీ గార్డులు బయటకు తీసుకొచ్చారు. కాసేపటికి కోలుకున్నట్లే అనిపించింది. అయితే..



ఊపిరి ఆడక.. ఆ మరుసటి ఉదయమే అది మాల్‌ మెట్ల కింద కన్నుమూసింది. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. సాధారణంగా మూగ జీవాలు మంటలు చూస్తే దూరంగా పరిగెడతాయి. అలాంటిది బందు మాత్రం కేవలం మనుషుల్ని కాపాడే ఉద్దేశంతోనే వెళ్లి ప్రాణం పోగొట్టుకుంది. అందుకే మాల్‌ దగ్గర బందు స్మారక స్థూపం నిర్మిస్తాం అని ప్రకటించారు యానిమల్‌ యాక్టివిస్ట్‌ డాక్టర్‌ నందినీ కులకర్ణి. దుకాణాల ఓనర్లు, సెక్యూరిటీ గార్డుల ఆశ్రునయనాల మధ్య ఆదివారం బందు అంత్యక్రియలు మాల్‌ దగ్గరే నిర్వహించారు.

 
బందు అంటే మరాఠీలో నిజాయితీ అని అర్థం. ఆ పేరుకు తగ్గట్లే సార్థక జీవితం గడిపి.. తుది శ్వాస విడిచింది ఆ మూగ జీవి. నష్టం జరిగితే జరిగింది..కానీ, బందు లాంటి విశ్వాసాన్ని, నిలువెత్తు నిజాయితీ మళ్లీ చూడగలమా? అంటూ బాధపడుతున్నారు ఆ దుకాణాల ఓనర్లు. పాపం..బందు లేకపోయేసరికి బాలు కూడా రెండు రోజులుగా ఏం ముట్టట్లేదట!.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement