జనాభా ప్రాతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి: విజయసాయిరెడ్డి | BCs Should be given Reservation on basis of Population Representation | Sakshi
Sakshi News home page

జనాభా ప్రాతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి: విజయసాయిరెడ్డి

Published Fri, Dec 9 2022 12:46 PM | Last Updated on Fri, Dec 9 2022 12:52 PM

BCs Should be given Reservation on basis of Population Representation - Sakshi

న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో శుక్రవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. దశాబ్దాలుగా తీవ్ర అన్యాయానికి గురైన వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికపై విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, చట్ట సభలు, న్యాయ వ్యవస్థల్లో రిజర్వేషన్‌ కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేయడమే వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దినట్లు  అవుతుందని అన్నారు.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 75వ సంవత్సరం ఇది. ఈ 75 ఏళ్ళలో దేశం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. కానీ వెనుకబడిన తరగతుల అభ్యున్నతి విషయంలో మాత్రం స్వతంత్ర భారతావని విఫలమైందన్న విషయం కఠోర వాస్తవం అని విజయసాయి రెడ్డి అన్నారు. అన్ని రంగాలలో తమకు సమాన అవకాశాలు ఉండాలన్న వెనుకబడిన తరగతుల ప్రజల దీర్ఘకాలిక  ఆకాంక్ష మాత్రం ఈనాటికీ నెరవేరలేదని అన్నారు.

దేశంలో షెడ్యూల్డు కులాలు, తెగల జనాభాను లెక్కించి జనాభా ప్రాతిపదికపై వారికి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కానీ వెనుకబడిన కులాలను అన్యాయంగా కుల గణన నుంచి విస్మరించి జనాభా ప్రాతిపదికపై వారికి రిజర్వేషన్‌ కల్పించలేకపోయాం. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలో వారికి న్యాయంగా దక్కవలసిన రిజర్వేషన్‌ దక్కలేదని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. దేశ జనాభాలో వెనుకబడిన తరగతులు ప్రజలు 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్‌ 27 శాతానికే పరిమితమైంది. రిజర్వేషన్‌ సీలింగ్‌ 50 శాతం మించి ఉండొచ్చు.

ఈ సీలింగ్ను సవరించడం రాజ్యాంగ మౌలిక సూత్రాల ఉల్లంఘన ఏమాత్రం కాబోదు అంటూ ఇటీవల దేశ అత్యున్నత న్యాయ స్థానం కూడా అభిప్రాయపడిందని విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ నేపధ్యంలో వెనుకబడిన తరగతులకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ కల్పించడంలో ప్రభుత్వానికి న్యాయపరమైన అవరోధాలు కూడా ఏమీ ఉండబోవు. కాబట్టి బీసీలకు విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగం, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలో వారి జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్‌ కల్పించేందుకు అవసరమైన అని చర్యలు చేపట్టవలసిందిగా విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement