యూపీ టెక్కీ అనూప్ డెత్‌నోట్‌లో చేదు నిజాలు
తల్లిదండ్రులు పట్టించుకోలేదని ఆవేదన
యశ్వంత్ పుర : అమ్మా నాన్న మాట్లాడడం లేదు. నేను కష్టంలో ఉంటే ఎవరూ చేయి పట్టడం లేదు.. అనే ఆవేదనే టెక్కీ కుటుంబం ఉసురు తీసింది. బెంగళూరు సదాశివనగర ఆర్‌ఎంవీ లేఔట్‌లో ఆదివారం రాత్రి ఇద్దరు పిల్లలను చంపి, ఆపై టెక్కీ దంపతులు ఆత్మహత్య చేసుకున్న కేసులో డెత్‌నోట్‌లో వారి ఆవేదన అందరికీ కంటనీరు తెప్పింది. మానవ సంబంధాలు ఎలా పతనమవుతున్నాయో చాటింది. టెక్కీ అనూప్, భార్య రాఖి తమ పిల్లలు అనుప్రియా, ప్రియాంశ్‌లకు విషాహారం పెట్టి హత్య చేసి ఆపై వారు ఉరి వేసుకొన్నారు. అనూప్ ఒక పేజీ డెత్‌నోట్‌ను రాసి తన సోదరునికి ఈ మెయిల్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఎలా ఉన్నావు అనేవారు లేరు
అనూప్ ఉద్యోగరీత్యా ఉత్తరప్రదేశ్ నుంచి బెంగళూరుకు వచ్చాడు. అనూప్ టెక్కీ కాగా, రాఖీ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేది. ఇద్దరూ వర్క్ ఫ్రం హోంలో పని చేస్తున్నారు. రాఖీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ కారణంతో తల్లిదండ్రులు అతన్ని దూరం పెట్టారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్వీకరించలేదు. మాట్లాడితే, ఆస్తిని అడుగుతాడని అనుమానించేవారని లేఖలో రాశాడు. ఇద్దరు పిల్లలు పుట్టినా ఎవరూ మాట్లాడింది లేదు.
కుటుంబీకులు ఒక్కరూ వీడియో కాల్ చేసి పలకరించలేదు. దీంతో నా భార్య మానసికంగా కుంగిపోయింది. కూతురు అనుప్రియాకు బుద్ధిమాంద్యం ఉండేది. అందువల్ల నేను, రాఖీ చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు కూడా ఎవరూ మాకు ధైర్యం చెప్పలేదు అని బాధను వెళ్లబోసుకున్నాడు. పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని అనూప్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినా ఎవరూ రాలేదు. మృతదేహాలను ఆస్పత్రిలో భద్రపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment