
దేశమంతటా తిరంగా ఉత్సవాల్లో మునిగితేలుతోంది. స్వాతంత్య్ర సంగ్రామంలో జాతిని నడిపించి అహింసా విధానంలో స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన గాంధీజీకి జేజేలు పలుకుతున్నాం. కానీ ఆయన విశ్రమించిన భవనాల బాగోగులూ ఎవరికీ పట్టడం లేదు.
తుమకూరు: జాతి పిత మహాత్మా గాంధీ నడయాడిన స్థలాలు ఎంతో పేరుపొంది నేడు పర్యాటక ప్రదేశాలుగా మారాయి. ఆ మహానుభావుడు బసచేసిన భవనాలు స్మారక కట్టడాలుగా పేరు పొందాయి. కానీ తుమకూరు జిల్లాలోని తిపటూరులోని ఓ కట్టడానికి ఆ భాగ్యం కలగలేదు. గాంధీజీ సేదతీరిన ఒకనాటి ఇల్లు నేడు కనీస పర్యవేక్షణ లేక అధ్వాన్నంగా మారిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు.
తిపటూరులోని పాత బీడిఓ కార్యాలయం ప్రస్తుతం తాలూకా పంచాయతీ ఆఫీసు వెనుక భాగంలో ఉన్న ఓ ఇల్లు ఉంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో.. 1927 ఆగస్టు 21వ తేదీన దేశమంతటా పర్యటిస్తూ తిపటూరుకు వచ్చిన బాపూజీ ఇదే గదిలో విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే ఉన్న చేద బావి నీటిని ఉపయోగించారు. అలా ఆ భవనం చరిత్రకెక్కింది. 1915– 1948 వరకు సంఘటనలతో కూడిన డీటైల్డ్ క్రోనాలజీ అనే పుస్తకంలో కూడా నమోదు చేశారు. జయదేవ హాస్టల్ ఆవరణలో సభలో గాంధీజీ ప్రసంగిస్తూ స్వరాజ్య సంగ్రామంలో పాల్గొనాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ ఘన చరిత గల భవనం నేడు నిర్లక్ష్యపు చీకట్లో మగ్గుతోంది. చుట్టూ చెత్త పేరుకుపోయింది. జిల్లా యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు.
తుమకూరు కాలేజీ మైదానం గది కూడా..
అలాగే తుమకూరు నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉన్న మహాత్మా గాం«దీజీ స్మారక భవనం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎమ్మెల్యే పరమేశ్వర్ ఆదివారం ఆ భవనాన్ని పరిశీలించారు. 1932లో, 1937లో గాం«దీజీ పలుమార్లు తుమకూరు జిల్లాకు వచ్చారని, అప్పుడు కాలేజీ మైదానంలో ఉన్న గదిలో బస చేశారని చెప్పారు. ఆ గదిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఇప్పటికైనా సంరక్షించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: వీడియో: స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు.. ఈ పాటలు విన్నప్పుడల్లా ఉప్పొంగే దేశభక్తి
Comments
Please login to add a commentAdd a comment