ఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన‍్వేస్టిగేషన్(సీపీఐ)కి అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారని చెప్పారు. గత మూడు నెలలపాటు మణిపూర్‌లో జరిగిన హింసాకాండకు సంబంధించిన పలు కేసులను రాష్ట్రం వెలుపల కూడా విచారణ జరపడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మణిపూర్‌లో రెండు జాతుల మధ్య అల్లర్లు హింసాత్మకంగా మారాయి. గత మూడు నెలలుగా అల్లర్లలో అమానవీయ ఘటనలు ఎన్నో జరిగాయి. మహిళలపై అత్యాచారాలు, లూఠీలు, దొంగతనాలు, సహా దారిదోపిడీల వరకు అనేక కేసులు పలు పోలీసు స్టేషన్‌లలో నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అల్లర్లలో ఆందోళనకారులు దేశమంతా తలదించుకునే సంఘటన మే 3న జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకొచ్చింది. ఇద్దరు మహిళలను అల్లరిమూకలు నగ్నంగా ఊరేగించారు. అనంతరం వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. అటు రాజకీయంగా కూడా దుమారాన్ని రేపింది. ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిందించాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే మణిపూర్ ఈ దుస్థితికి చేరిందని ఆరోపించాయి. పార్లమెంట్ సమావేశాల్లోనూ ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించాలని పట్టుబడుతున్నాయి. గత వారం రోజులుగా ఈ అంశంపైనే పార్లమెంట్ సమావేశాలు ప్రతిపక్షాల ఆందోళనలతో వాయిదా పడుతూ వస్తున్నాయి.
ఇదీ చదవండి: కెమెరా సాక్షిగా మణిపూర్‌లో జవాన్ వికృత చేష్టలు.. మహిళను బయటకు లాగి..
Comments
Please login to add a commentAdd a comment