న్యూఢిల్లీ: తెలంగాణలో బియ్యం సేకరణ నిలిపివేతపై కేంద్రం వివరణ ఇచ్చింది. ప్రధానమంత్రి అన్న యోజన కింద ఇవ్వాల్సిన బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని.. అందుకే సెంట్రల్ పూల్‌లోకి బియ్యం సేకరించడాన్ని నిలిపివేశామని కేంద్రం ప్రకటించింది. అయితే ఈ పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వమే సృష్టించిందని విమర్శించింది. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం మండిపడింది. కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనే విషయాన్ని గుర్తించామని పేర్కొంది.
40 మిల్లుల్లో 4,53,896 బియ్యం సంచులు మాయమవడాన్ని గుర్తించామని తెలిపిన కేంద్రం.. డిఫాల్టయిన మిల్లర్ల జాబితాను మార్చి 31న తెలంగాణ ప్రభుత్వానికి పంపించామని వెల్లడించింది. అయితే మళ్లీ మే 21న 63 మిల్లుల్లో 1,37,872 బియ్యం సంచులు మాయమైన అంశం వెలుగులోకి వచ్చిందని, 593 మిల్లుల్లో లెక్కించడానికి వీలు లేకుండా ధాన్యం సంచులను నిల్వచేశారని పేర్కొంది. లోపాలను సరిదిద్దుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయిందని తెలిపింది.
అన్న యోజన కింద ఏప్రిల్-మే నెలల కోటా కింద 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వెల్లడించింది. అయితే ఆ బియ్యాన్ని లబ్దిదారులకు అందకుండా చేసిందని, ఈ కారణంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో సెంట్రల్ పూల్‌లోకి బియ్యం సేకరణను నిలిపివేసినట్లు తెలిపింది.
చదవండి: చర్చనీయాంశంగా మారిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి చేరిక
1.. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకోకపోవడం
2.. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)అమలు చేయకపోవడం
3.. PMGKAY కింద తీసుకున్న కోటా బియ్యాన్ని పంపిణీ చేయకపోవడం
పై కారణాలతో సెంట్రల్ పూల్ సేకరణ నిలిపివేయాల్సి వచ్చిందని, వీటిపై యాక్షన్ టేకెన్ రిపోర్టును తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి అందజేయాలని ఆదేశించింది. ఆ తరువాత సెంట్రల్ పూల్ సేకరణ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment