బదౌన్(యూపీ): స్వాతంత్య్ర దినోత్సవం రోజు భగత్‌సింగ్ నాటక ప్రదర్శన ఇచ్చి, గ్రామస్తుల మెప్పు పొందాలనుకున్న బాలుడి ఆశలు నెరవేరలేదు. అదే నాటకం కోసం సాధన చేస్తూ ప్రాణాలొదిలాడు. భగత్‌సింగ్‌కు బ్రిటిష్ అధికారులు ఉరి వేసే దృశ్యాన్ని ప్రాక్టీస్ చేస్తుండగా నిజంగానే ఉరి బిగుసుకోవడంతో చనిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లా కున్వర్‌గావ్ పోలీసుస్టేషన్ పరిధిలోని బాబత్ గ్రామంలో ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూరేసింగ్ కుమారుడు శివం(10) చదువులో చురుగ్గా ఉంటాడు.
ఆటపాటల్లో మేటి. గురువారం తన తోటి పిల్లలతో కలిసి భగత్‌సింగ్ నాటకంలో ఉరివేసే దృశ్యం రిహార్సల్స్‌లో పాల్గొన్నాడు. ఇందులో శివం కథానాయకుడు భగత్‌సింగ్ పాత్ర పోషిస్తున్నాడు. రిహార్సల్స్‌లో భాగంగా శివం తన మెడకు ఉరితాడు తగిలించుకున్నాడు. ఇంతలోనే కాళ్ల కింద ఉన్న పీట జారిపోయింది. శివం మెడకు తాడు బిగుసుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే వచ్చి శివంను కిందికి దించారు. తాడును తొలగించారు. అప్పటికే అతడు ఊపిరాడక మృతిచెందాడు. తమకు సమాచారం ఇవ్వకుండానే శివం మృతదేహానికి అతడి తల్లిదండ్రులు, గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment