సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసిన నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మొదలైన ప్రయోగాల్లో ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే చైనా శాస్త్రవేత్తలు ఆదివారం కీలక ప్రకటన చేశారు. తాము రూపొందించిన వ్యాక్సిన్ అన్ని ప్రయోగాల్లో విజయవంతమై.. విడుదలకు అనుమతి పొందిందని ప్రకటించారు. కరోనాకు విరుగుడుగా డ్రాగాన్ తయారు చేసిన కిన్సినో బయో వ్యాక్సిన్ లిమిటెడ్‌కు చైనా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఆ దేశానికే చెందిన వూహన్, సినోవాక్ వ్యాక్సిన్లు మూడు దశల్లోనూ ప్రయోగాలను పూర్తిచేసుకున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తించిన ఆక్స్‌ఫర్డ్‌తో చైనా కంపెనీలు పోటీపడుతున్నాయి.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ఇప్పటికే మూడు ఫేజ్‌లను పూర్తిచేసుకుని బహిరంగ మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తినెలకొంది. ఇక ఆస్ట్రేలియా సైతం కరోనా విరుగుడు తయారీలో దూసుకుపోతోంది. ఆ దేశ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా మార్డోక్ వ్యాక్సిన్ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే బహిరంగ మార్కెట్‌లో విడుదల చేయడానికి ఆ దేశ వైద్య పరిశోధన మండలి అనుమతి కోసం ఎదురుచేస్తున్నారు. ఇక భారత్ బయోటెక్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కోవాగ్జిన్ సైతం ప్రయోగాల్లో సత్ఫలిస్తోందని ఐసీఎంఆర్ ఇదివరకే ప్రకటించింది.
అయితే మన దేశంలో తయారు చేసే వ్యాక్సిన్ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా, ఆస్ట్రేలియా దేశాలు తయారుచేసిన వ్యాక్సిన్‌పై భారత్ ఆధారపడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లోకి వ్యాక్సిన్ వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున ఆర్డర్ ఇచ్చేందుకు భారత్‌కు చెందిన కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.
అయితే అవి భారత్‌లో వ్యాపించిన కరోనా వైరస్‌ని చంపగలవా? దేశ ప్రజలపై అది ప్రభావం చూపుతుందా అనే సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది. దీనిపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు లోతైన పరిశోధనలు జరిపారు. ప్రపంచ దేశాలకు ఎలాంటి కరోనా వైరస్ సోకిందో, భారత్‌లోనూ అదే వైరస్ వ్యాప్తి చెందిందని అందువల్ల ప్రపంచ దేశాలు వాడే వ్యాక్సిన్ భారతీయులూ వాడొచ్చని డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment