
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం రేపిన జార్ఖండ్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసులో సుమోటో విచారణను అత్యున్నత ధర్మాసనం శుక్రవారం చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయవ్యవస్థను కించపరిచే ట్రెండ్ దురదృష్టకరమన్నారు. న్యాయమూర్తులకు ఫిర్యాదు చేసే స్వేచ్ఛ కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
జడ్జిలు ఫిర్యాదు చేసినా పోలీసులు, సీబీఐ స్పందించడంలేదని, పట్టించుకోవడం లేదని చీఫ్ జస్టిస్ రమణ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు ఐబీ, సీబీఐ సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. జార్ఖండ్ జడ్జి హత్య వ్యవహారమే ఒక ఉదాహరణ అని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. అంతేకాదు పూర్తి బాధ్యతతోనే తానీ వ్యాఖ్యలు చేస్తున్నానన్నారు. గనుల మాఫియా ఉన్న ప్రాంతంలో జడ్జిలకు, వారి నివాస ప్రాంతాలకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు. న్యాయవ్యవస్థలో దాడులకు గురైన న్యాయమూర్తుల జాబితా తన దగ్గర ఉందన్నారు. న్యాయమూర్తుల రక్షణపై కొన్ని రాష్ట్రాలు కౌంటర్లు దాఖలు చేశాయనీ, మిగతా రాష్ట్రాలు కూడా స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని ఎన్వీ రమణ ఆదేశించారు. అనంతరం తదుపరి విచారణ ఆగస్టు 17కు వాయిదా వేశారు.
కాగా ధన్‌బాద్‌కు చెందిన జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ది అనుమానాస్పద మృతిగా, తరువాత రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగానే భావించారు. కానీ సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను ఢీకొట్టి హత్య చేసినట్లుగా తేలింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రకంపనలు పుట్టించింది. దీంతో ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు బార్ అసోసిసేషన్(ఎస్‌సీబీఏ) చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు విజ్ఞప్తి చేసింది. న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించింది. ఈ వ్యవహరాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీం జార్ఖండ్ డీజీపీనుంచి వివరణ కోరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment