విన్నపాలు వినవలె | CM Revanth Reddy request to Union Ministers | Sakshi
Sakshi News home page

విన్నపాలు వినవలె

Published Tue, Jul 23 2024 4:49 AM | Last Updated on Tue, Jul 23 2024 4:49 AM

CM Revanth Reddy request to Union Ministers

‘మూసీ అభివృద్ధి’కి రూ.10 వేల కోట్లు కేటాయించండి   

ఈసారైనా జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులు ఇవ్వండి

గ్యాస్‌ సబ్సిడీని ముందుగానే చెల్లించే అవకాశం కల్పించండి

పౌరసరఫరాల శాఖ బకాయిలు వెంటనే విడుదల చేయండి

కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి వినతి

సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చారు. నిధులు విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు సీఆర్‌ పాటిల్, హర్‌దీప్‌ సింగ్‌ పూరి, ప్రల్హాద్‌ జోషిలతో సీఎం సమావేశమయ్యారు.

మూసీ సుందరీకరణపై రాష్ట్ర సర్కారు దృష్టి
మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మొత్తం రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ను ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్‌ నగరంలో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదిని దేశంలో మరెక్కడా లేని విధంగా తీర్చిదిద్దడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. 

మూసీ సుందరీకరణతో పాటు దానిలో చేరే మురికినీటి శుద్ధికి, వరద నీటి కాల్వల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మురికి నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు, గోదావరి జలాలతో ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌ సాగర్‌లను నింపేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఈ రెండు చెరువులను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్‌ నీటి ఇబ్బందులు తీరడంతో పాటు మూసీ నది పునరుజ్జీవనానికి తోడ్పడుతుందని వివరించారు. 

నల్లా కనెక్షన్లకు రూ.16,100 కోట్లు అవసరం
జల్‌ జీవన్‌ మిషన్‌ కింద తెలంగాణకు నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. 2019 లెక్కల ప్రకారం జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రాష్ట్రంలో 77.60 శాతం ఇళ్లకు నల్లా నీరు అందుతోందని,  అయితే ఇటీవల తాము చేపట్టిన సర్వేలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్‌ లేదని తేలిందని వివరించారు. ఆ ఇళ్లతో పాటు పీఎంఏవై అర్బన్, రూరల్‌ కింద చేపట్టే ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని, ఇందుకు మొత్తం రూ.16,100 కోట్లు అవసరమని తెలిపారు. జల్‌ జీవన్‌ మిషన్‌ 2019లోనే ప్రారంభించినా నేటి వరకు రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని, ఈ ఏడాది నుంచైనా నిధులు విడుదల చేయాలని కోరారు. 

సిలిండర్‌కు రూ.500 చెల్లించేలా చూడండి
తెలంగాణలో రూ.500కే గ్యాస్‌ సరఫరాకు సంబంధించిన సబ్సిడీని ముందుగానే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు (ఓఎంసీ) చెల్లించే సదుపాయాన్ని కల్పించాలని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీని సీఎం కోరారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా తమ ప్రభుత్వం రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేస్తోందని తెలిపారు.

అయితే వినియోగదారులు సిలిండర్‌కు పూర్తిగా డబ్బులు చెల్లించిన తర్వాత  సబ్సిడీ అందుతుండడంతో ఇబ్బందికరంగా ఉందన్నారు. కాబట్టి  సబ్సిడీని ముందుగానే ఓఎంసీలకు చెల్లించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అప్పుడు వినియోగదారులు రూ.500 మాత్రమే చెల్లించి సిలిండర్‌ తీసుకునే అవకాశం కలుగుతుందని వివరించారు. ఒకవేళ అలా వీలుకాని పక్షంలో 48 గంటల్లోపు సబ్సిడీ మొత్తం వినియోగదారులకు అందేలా చూడాలని కోరారు.

బియ్యం బకాయిలు విడుదల చేయండి
ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రల్హాద్‌ జోషిని రేవంత్‌ కోరారు. 2014–15 ఖరీఫ్‌ కాలంలో అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ.1,468.94 కోట్ల రాయితీని పెండింగ్‌లో పెట్టారని చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన 89,987.730 మెట్రిక్‌ టన్నుల బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లు విడుదల చేయాలని కోరారు. 

అలాగే 2021 మే నుంచి 2022 మార్చి వరకు నాన్‌ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ (నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09 కోట్లు కూడా వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఎంపీలు రామసహాయం రఘురామిరెడ్డి, సురేష్‌ షెట్కార్, అనిల్‌కుమార్‌ యాదవ్, సీఎం కార్యదర్శి చంద్రశేఖర్‌ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement