మైసూరు: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక ప్రజలకిచ్చిన కీలక ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పుడిక దేశమంతటా కర్ణాటక మోడల్‌నే అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 1.1 కోట్ల మహిళలకు నెలకు రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందించే ఎన్నికల వాగ్దానమైన గృహ లక్ష్మి పథకం అమలుకు సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా బుధవారం శ్రీకారం చుట్టింది.
ఈ సందర్భంగా మైసూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. తామెప్పుడూ తప్పుడు వాగ్దానాలు చేయబోమని చెప్పారు. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం చేసిన, చేస్తున్న మంచి పనులను దేశమంతటా విస్తరించి చూపిస్తామన్నారు. ప్రభుత్వాలు పేదల కోసమే పాటుపడాలన్నది కాంగ్రెస్ విధానమని చెప్పారు. ‘వేర్లు గట్టిగా ఉంటేనే చెట్టు దృఢంగా ఉంటుంది.
కన్నడ మహిళలు వేర్ల వంటివారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం మహిళలను నిర్లక్ష్యం చేస్తూ అపర కుబేరులను మాత్రమే నెత్తిన పెట్టుకుంటోంది‘ అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు సభలో పాల్గొన్నారు. గత మే లో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం తెలిసిందే. అందుకు దోహద పడ్డ ఐదు ప్రధాన వాగ్దానాల్లో గృహ లక్ష్మి పథకం ఒకటి.
చైనా మ్యాప్ తీవ్రమైన అంశం
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌ను తమ అంతర్భాగంగా చూపుతూ చైనా తయారుచేసిన మ్యాప్ చాలా తీవ్రమైన అంశమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ తక్షణం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ నేను ఇప్పుడే లద్దాఖ్ నుంచి తిరిగి వచ్చాను. అక్కడ అంగుళం నెల కూడా అన్యాక్రాంతం కాలేదన్న మోదీ మాటలు పచ్చి అబద్ధాలు. చైనా మన భూమిని ఆక్రమించిందని లద్దాఖ్‌లో ప్రతి ఒక్కరికీ తెలుసు‘ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment