
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ విస్త్రృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 కట్టడికై కేజ్రీవాల్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే, అత్యవసరాలు, వాక్సినేషన్ కోసం ప్రయాణాలు చేసే వారికి ఈ- పాసులు జారీ చేస్తామని, కర్ఫ్యూ సమయంలో వారికి మాత్రం అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.
అదే విధంగా, జర్నలిస్టులు, ప్రైవేటు డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి అనుమతిస్తామని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో సోమవారం కొత్తగా 3548 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 15 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఇక మహారాష్ట్ర, రాజస్తాన్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.