సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కేసులు మూడు లక్షలకు పైగానే ఉంటున్నాయి. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే.. ఈ సారి ఆక్సిజన్ వినియోగం అత్యధికంగా ఉంది. చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు దగ్గరపడుతుండటంతో కొత్త వారిని చేర్చుకోవడం లేదు. ఇక ఢిల్లీ, రాజస్తాన్ వంటి చోట్ల ఆక్సిజన్ కొరతతో పలువురు ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. పరిస్థితి విషమిస్తుండటంతో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ సప్లైని అడ్డుకునే వారిని ఉరి తీస్తామని హెచ్చరించింది.
ఆక్సిజన్ కొరతపై రాష్ట్రంలోని మహారాజ అగ్రసేన్ ఆస్పత్రి దాఖలు చేసిన పిటిషన్‌పై విపిన్ సంఘి, రేఖ పల్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆక్సిజన్ సరఫరా అడ్డుకునే వారికి సంబంధించి ప్రభుత్వం ఎవరిమీద అయినా తమకు ఫిర్యాదు చేస్తే.. కోర్టు సదరు వ్యక్తిని తప్పక ఉరి తీస్తుంది అని తెలిపింది. ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఈ విషయంలో ఎంత పెద్ద అధికారి అయినా సరే.. తప్పు చేస్తే వారికి శిక్ష తప్పదని కోర్టు హెచ్చరించింది. అంతేకాక ఇలాంటి అధికారుల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం వారి వారి మీద తగిన చర్యలు తీసుకుంటుందని కోర్టు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment