
ఢిల్లీ కోర్టు ఫైల్ ఫోటో
న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి.. బాధితురాలి చేతి మీద ఉన్న టాటూ ఆధారంగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎందుకంటే బాధితురాలి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన వ్యక్తి పేరునే తన చేతి మీద టాటూగా వేయించుకుంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విచారణ సందర్భంగా సదరు మహిళ.. నిందితుడు బలవంతంగా అతడి పేరును తన చేతి మీద టాటూ వేయించాడని ఆరోపించింది. అయితే కోర్టు బాధితురాలి ఆరోపణలని కొట్టి పారేసింది. బలవంతంగా ఓ వ్యక్తికి టాటూ వేయడం అంత సులభం కాదని తెలిపింది.
ఈ సందర్భంగా జస్టిస్ రజ్నిష్ భట్నాగర్ మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం టాటూ వేయడం అనేది ఓ కళ. అందుకు ప్రత్యేకమైన పరికరం కావాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఓ వ్యక్తికి బలవంతంగా టాటూ వేయలేం. పచ్చబొట్టు పొడిపించుకోవడం ఇష్టం లేకపోతే అవతలి వారు దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. కనుక బలవంతంగా టాటూ వేయడం.. ఒకవేళ వేసినా అది పర్ఫెక్ట్‌గా రావడం అనేది జరగదు’’ అని తెలిపారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.
ఈ క్రమంలో సదరు మహిళ.. నిందితుడు తనను బెదిరించి, భయపెట్టి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. 2016 నుంచి 2019 వరకు ఇది కొనసాగిందని తెలిపింది. చివరకు ధైర్యం చేసి అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించింది. మహిళ ఆరోపణలు ఇలా ఉండగా.. నిందితుడు మాత్రం సదరు వివాహితను తాను ప్రేమించానని.. ఇద్దరి సమ్మతితోనే తమ మధ్య శారీరక సంబంధం కొనసాగిందని వెల్లడించాడు. అయితే కొద్ది రోజులుగా మహిళ తనను దూరం పెడుతుందని.. దాని గురించి ప్రశ్నిస్తుండటంతో తన మీద పోలీసులకు ఫిర్యాదు చేసిందని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment