‘దేశం పునాదులెంతో బలోపేతంగా ఉన్నాయి. అసమ్మతి గళాలు, నిరసన ప్రదర్శనలతోనే కదిలిపోయేంత బలహీనంగా అవి లేవు, పకడ్బంది మూలాలతోనే ఉన్నట్టు మేం భావిస్తున్నాం’ అన్న ఢిల్లీ న్యాయస్థానపు ధర్మాసనం మాటలు ప్రజాస్వామ్య వాదులకు సరికొత్త భరోసా కల్పిస్తున్నాయి. ప్రజాస్వామ్య సువాసనను మరింత పరిమళభరితంగా వెదజల్లాయి. ఈ ప్రక్రియలో అవిభాజ్యాలైన... ‘ప్రశ్న’కు ప్రాణం పోసేవిగా, ‘అసమ్మతి’కి ఆయువిచ్చేవిగా, ‘నిరసన’కు నీడ పట్టేవిగా ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే ఏ పద్దతుల్ని జాగ్రత్తగా కాపాడు కోవాలో, మరే సరికొత్త బాటలు పరచి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టకూడదో కూడా న్యాయస్థానం ఈ సందర్భంగా సెలవిచ్చింది. ఏడాది కింద ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లు– దాడులకు సంబంధించిన కేసులో అరెస్టయిన ముగ్గురు విద్యార్థులు, హక్కుల కార్యకర్తలకు బెయిల్ ఇస్తూ ధర్మాసనం నిర్దిష్ట వ్యాఖ్యలు చేసింది. బెయిల్ ఇవ్వరాదన్న వాదనను నిర్ద్వందంగా తోసి పుచ్చింది. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వెల్లడించిన అభిప్రాయాలు దేశంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ–సామాజిక వాతావరణంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజ్యాంగ రక్షణకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వాలకు, చట్టాల అమలుకు కృషి చేయాల్సిన పోలీసు వంటి కార్యనిర్వాహక వ్యవస్థకు విస్పష్ట సందేశం ఈ వ్యాఖ్యల్లో ఉంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, యూఏపీఏ(ఉప)ను దుర్వినియోగ పరచడం తప్పని ఢిల్లీ పోలీసుల్ని ధర్మాసనం మందలించింది. ‘అసమ్మతిని అణచివేయాలనే ఉత్సుకత, పరిస్థితులు చెయిదాటి పోతాయే మోనన్న అసహజ భయంతోనే రాజ్యం ఈ చర్యలకు పాల్పడి ఉంటుంది, పౌరుల ‘నిరసన తెలిపే హక్కు’ కు ‘తీవ్రవాద కార్యకలాపాల’కు మధ్యనుండే స్పష్టమైన విభజన రేఖను మసక బార్చింద‘ని ధర్మాసనం వాఖ్యానించింది. బెయిల్ పిటిషన్లను విచారిస్తూ, ప్రాసిక్యూషన్ అభియోగ పత్రంలో నమోదు చేసిన తీవ్రవాద నేరాలను నిర్ధారించగల ప్రాథమిక సాక్ష్యాధారాలేవీ ఈ కేసుల్లో కన్పిం చలేదని స్పష్టపరుస్తూ సదరు వ్యాఖ్యలు చేసింది. రాజకీయ, మేధావి వర్గం నుంచి తనపై వస్తున్న విమర్శల్ని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సహించడం లేదని, ఆరోపణలు చేసే, ప్రశ్నించే వారిపైన తప్పుడు పద్ధతుల్లో చట్టాలనుపయోగించి తీవ్ర చర్యలకు పాల్పడుతోందని విమర్శలు వస్తున్న నేప థ్యంలో.. ధర్మాసనం ప్రస్తుత వ్యాఖ్యలు చర్చను రేకెత్తిస్తున్నాయి. సీనియర్ సంపాదకుడు వినోద్ దువాపై రాజద్రోహం కేసు నమోదు చేయడం వంటివి సుప్రీంకోర్టు వరకూ వెళ్లి విమర్శల పాల వడం తెలిసిందే! ఈ కేసులోనూ అసమ్మతిని, నిరసన గళాల్ని నియంత్రించే క్రమంలో చట్టాన్ని తప్పుగా, నిర్హేతుకంగా వినియోగించడమేనని ధర్మాసనం సుస్పష్టంగా పేర్కొంది.
నిరాయుధులై శాంతియుత నిరసన తెలుపడం ప్రజాస్వామ్యం భద్రత కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కుగా న్యాయస్థానం గుర్తుచేసింది. శాంతియుతంగా సమావేశ మయ్యేందుకు, భావాలను వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించిన రాజ్యాంగ అధికరణం 19 (1) ‘బి’లో ఈ హక్కు మూలాలు నిక్షిప్తమై ఉన్నాయంది. ‘ఉప’ చట్టంలోని వివిధ సెక్షన్లలో పేర్కొన్న అంశాల ఆధారంగా చూసినా.. శాంతియుతంగా నిరసన తెలిపే పౌరుల హక్కు నిషేధించిందేం కాదు. తీవ్రవాద చర్య అంతకన్నా కాదనే భావనను వ్యక్తం చేసింది. ఇంకో అడుగు ముందుకు వేసి, ‘సరే, కొద్దిసేపు వాదన కోసమైనా నిందితుల ప్రసంగాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనుకుందాం, దారుల్ని దిగ్బం ధించారనే అనుకుందాం, ఇతర మహిళల్ని ప్రేరేపించారనీ భావిద్దాం, అభియోగ పత్రంలో చెప్పి నట్టు రాజ్యాంగం అనుమతించిన పరిమితుల్ని దాటి, మితిమీరిన నిరసననే వ్యక్తం చేశారను కుందాం... అయినా అది ‘ఉప’ చట్టంలో పేర్కొన్నట్టు ‘తీవ్రవాద చర్య’ (సెక్షన్–15), ‘తీవ్రవాద కార్యకలాపాలకై నిధుల సమీకరణ’ (సెక్షన్–17), ‘కుట్ర’ (సెక్షన్–19) వంటి నేరమేమీ కాజాలదని గ్రహించాలని దర్మాసనం వివరించింది. ‘ఇలా ప్రశ్నించే గళాలను, అసమ్మతిని అణచివేసేందుకు ‘చట్టబద్ధ నిరసన’కు ‘తీవ్రవాద చర్య’లకు మధ్య విభజన రేఖను మసకబార్చో, చెరిపేసో... దాన్నొక కొత్త బాటగా మలిస్తే, ఇక ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డట్టే’ అన్న తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారు లేవనెత్తే ప్రశ్న తప్పా? ఒప్పా? ‘న్యాయ బద్ధమా!’ ‘న్యాయ బద్ధం కాదా!’ అన్నదానితో నిమిత్తం లేకుండా చట్టబద్ధ అసమ్మతి తెలియపర చడం ప్రజాస్వామ్యంలో ఒక ఎన్నదగిన, గౌరవప్రదమైన ప్రక్రియ అనీ నొక్కి చెప్పింది. పాలకుల నిర్ణయాలకు ప్రభావితులైన వారు తమకు జరిగిన అన్యాయాలను వెల్లడించే హక్కు ఉంటుందన్నదే నిరసనల వెనుక స్ఫూర్తిగా పరిగణించాలనీ వ్యాఖ్యానించింది.
ధర్మాసనం ముఖ్యంగా ‘.... భారత శిక్షా స్మృతి (ఐపీసీ) లోని సాధారణ నేరాలకు, ‘ఉప’ చట్టంలో నిర్దేశించిన తీవ్రవాద నేరాలకు చాలా వ్యత్యాసమున్నట్టు గ్రహించాలంది. ఈ ప్రత్యేక చట్టం తీసుకురావడమైనా, తదుపరి 2004, 2008 లో తెచ్చిన సవరణల వెనుక స్ఫూర్తి అయినా ‘భారతదేశ భద్రత’ అన్న స్థూలార్థంలోని అంశాల కోసమే తప్ప... పైసా ఎక్కువ కాదు, పైసా తక్కువ కాదు’అని స్పష్టపరిచింది. ‘‘ఏ కొందరి చేతుల్లోకో అధికారం కట్టబెట్టడం కాదు, వారి నడక గతి తప్పినపుడు, ప్రశ్నించే అధికారం ప్రతి పౌరుడికి ఉండటమే నిజమైన ప్రజాస్వామ్యం’‘ అన్న పూజ్య బాపూజీ మాటల్ని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం గుర్తుకు తెచ్చింది.
ప్రశ్నించే గళాలకు ప్రాణవాయువు
Published Thu, Jun 17 2021 2:54 AM | Last Updated on Thu, Jun 17 2021 3:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment