న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రి తీహార్ జైలుకు వెళ్లనున్నారు. ఈ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది.
లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కస్టడీ తాజాగా ముగియడంతో ఈడీ ఆయన్ని ఈ ఉదయం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు ఆయనకు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అలాగే తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. తీహార్ జైలుకు తరలించే ముందు భార్య సునీత, మంత్రులు అతిశీ, సౌరభ్ భరద్వాజ్‌లను కలిసేందుకు కోర్టు అనుమతించింది.
ఇక.. ఇవాళ కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ విచారణలో.. కేజ్రీవాల్ ఈ కేసు విచారణలో సహకరించడం లేదంటూ కోర్టుకు నివేదించింది. కేజ్రీవాల్ పొంతన లేని సమాధానాలతో దర్యాప్తును పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారని.. అలాగే తన డిజిటల్ డివైస్‌లను పాస్‌వర్డ్‌లను సైతం ఆయన చెప్పడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. అయితే కోర్టు కేజ్రీవాల్‌కు జ్యూడీషియల్ రిమాండ్ విధించినప్పటికీ.. భవిష్యత్తులో ఈడీ ఆయన్ని మరోసారి కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది.
ఇంకోవైపు.. తీహార్ జైల్లో కేజ్రీవాల్‌కు ప్రత్యేక వసతులు కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది రిక్వెస్ట్ పిటిషన్ వేశారు. జైలులో ప్రత్యేక ఆహారం, మందులు, అలాగే పుస్తకాలను అనుమతించాలని కోరారు. అదనంగా మతపరమైన లాకెట్ ధరించేందుకు కేజ్రీవాల్‌ను అనుమతించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విచారణ కోసం రావాలంటూ తొమ్మిది సార్లు ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఊరట కోసం కేజ్రీవాల్ కోర్టులను ఆశ్రయించినా లాభం లేకపోయింది. దీంతో.. సివిల్ లేన్స్‌లోని నివాసంలో మార్చి 22వ తేదీన తనిఖీల పేరుతో వెళ్లిన ఈడీ.. కొన్ని గంటలకే ఆయన్ని అరెస్ట్ చేసి తమ లాకప్‌కు తరలించింది. తద్వారా సీఎం పదవిలో ఉండగా అరెస్టైన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్ రికార్డుల్లోకి ఎక్కారు.
ఇదీ చదవండి: అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment