Delhi liquor scam: ఆమ్‌ ఆద్మీ భవితవ్యం ఏమిటీ? | Delhi Liquor Scam: Aam Aadmi Party Future Uncertain As ED Arrest Arvind Kejriwal, Details Inside - Sakshi
Sakshi News home page

Delhi liquor scam: ఆమ్‌ ఆద్మీ భవితవ్యం ఏమిటీ?

Published Sat, Mar 23 2024 4:24 AM | Last Updated on Sat, Mar 23 2024 2:46 PM

Delhi liquor scam: Aam Aadmi Party Future Uncertain As ED Arrest Arvind Kejriwal - Sakshi

కేజ్రీ అరెస్టును తట్టుకుని నిలిచేనా!

పార్టిలో ఆయన స్థానాన్ని భర్తీ చేసే నేతలేరీ?

ఇప్పటికే జైలుపాలైన సిసోడియా తదితరులు

లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్‌ల్లో భారీ దెబ్బే

‘ఆమ్‌ ఆద్మీ పార్టీకి జరగకూడని వేళ, జరగకూడనంతటి భారీ నష్టం’
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆప్‌ జాతీయ సమన్వయకర్త, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టుపై సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయమిది. రాజకీయ నిపుణుల నుంచి సామాన్య ప్రజల దాకా ఇదే భావన నెలకొని ఉందంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు విపక్షాల భవితవ్యాన్ని తేల్చేస్తాయని భావిస్తున్న అత్యంత కీలకమైన లోక్‌సభ ఎన్నికల వేళ జరిగిన ఈ అరెస్టు ఆప్‌కు నిజంగా కోలుకోలేని దెబ్బే. ఎందుకంటే ఆ పార్టికి సర్వం కేజ్రీవాలే.

ఆయన స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయగల నాయకులెవరూ లేరు. కాస్తో కూస్తో జనాకర్షణ ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఇప్పటికే ఇదే కేసులో జైల్లో మగ్గుతున్నారు. దాంతో సహజంగానే పార్టీ సారథిగా, సీఎంగా కేజ్రీవాల్‌ స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేయగల స్థాయి ఉన్న నేతలెవరూ ఆప్‌లో కని్పంచడం లేదు. కేజ్రీయే సీఎంగా కొనసాగుతారని, అవసరమైతే జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనల ఆంత్యరమూ అదే.

చట్టపరంగా అందుకు అడ్డంకులేమీ లేకపోయినా జైలునుంచి సీఎంగా కొనసాగడం అసాధ్యమేనన్న అభిప్రాయం సర్వత్రా విన్పిస్తోంది. అందులో ఇమిడి ఉన్న రాజ్యంగపరమైన సవాళ్లను ఎత్తిచూపుతూ రాష్ట్రపతి పాలనకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సిఫార్సు చేస్తారని, చివరికి ఢిల్లీ రాష్ట్రపతి పాలనలోకి వెళ్లవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అదే జరిగితే ఆప్‌ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు చందమే అవుతుంది. సమస్యలు కూడా రెట్టింపవుతాయి. ఏదేమైనా 12 ఏళ్ల ఆ పార్టీ ప్రస్థానంలో ఎన్నడూ లేనంత అతి పెద్ద సమస్యను ప్రస్తుతం ఎదుర్కొంటోంది. జాతీయ పార్టీగా మారడమే గాక పంజాబ్‌లోనూ అధికారం చేజిక్కించుకుని, దేశవ్యాప్తంగా మరింతగా విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న ఆప్, ఏకంగా తన ఉనికికే సవాలుగా మారిన ఈ పెను గండం నుంచి బయట పడగలదా అన్నది వేచి చూడాల్సిన అంశమే.

  చాలాకాలం జైల్లోనే...?
ఆప్‌ నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్‌ సింగ్‌ తరహాలోనే కేజ్రీవాల్‌ కూడా ఇప్పట్లో జైలు నుంచి బయటికొచ్చే అవకాశాలు కని్పంచడం లేదు. అదే జరిగితే ఆప్‌ మనుగడే ప్రమాదంలో పడవచ్చు. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు ఆరో విడతలో మే 25న, పంజాబ్‌లోని 13 స్థానాలకు జూన్‌ 1న ఏడో విడతలో పోలింగ్‌ జరగనుంది.

కీలకమైన రెండు నెలలూ ఆప్‌ను అనుక్షణం నాయకత్వ లేమి వేధించనుంది. ఢిల్లీ, పంజాబ్‌లో కేజ్రీవాల్‌ ప్రచారంపైనే పార్టీ ప్రధానంగా ఆధారపడింది. ప్రస్తుత ఆప్‌ నేతల్లో గట్టిగా విని్పంచే పేర్లు ఆతిషి మర్లేనా, రాఘవ్‌ చద్దా, సౌరభ్‌ భరద్వాజ్‌ మాత్రమే. వీరిలో ఎవరికీ పాలనపరమైన అనుభవం లేదు. రాజకీయంగా కూడా కేజ్రీవాల్‌ స్థాయిలో బీజేపీని ఢీకొనగల సత్తా కూడా అంతంతమాత్రమే.
  
హస్తినలో అస్తవ్యస్తమే!
ఆప్, కేజ్రీవాల్‌ హవా ఎంతగా ఉన్నా గత పదేళ్లుగా లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ హవాయే కొనసాగుతూ వస్తోంది. ఆప్‌ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ అక్కడ బీజేపీ ఏకపక్ష విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘనవిజయం కట్టబెడుతున్నా లోక్‌సభకు వచ్చేసరికి కాషాయ మంత్రం జపించడం ఢిల్లీ ఓటర్లకు ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈసారి ఎలాగైనా దీన్ని మార్చి సత్తా చూపాలని కేజ్రీవాల్‌ కృతనిశ్చయంతో ఉన్నారు.

‘లోక్‌సభలోనూ కేజ్రీవాల్, ఢిల్లీలో మరింత ప్రగతి’, ‘గుజరాత్‌లోనూ కేజ్రీవాల్‌’ అంటూ ఆప్‌ ఎన్నికల నినాదాలు కూడా పూర్తిగా ఆయనను కేంద్రంగా చేసుకునే రూపొందాయి. ఇలాంటి సమయంలో ఆయన జైలుపాలవడంతో ఒక్కసారిగా ఆప్‌ లోక్‌సభ ఎన్నికల ప్రణాళికే తలకిందులైపోయింది. ఇదిక్కడితో ఆగకపోవచ్చని, వచ్చే ఏడాది జరగనున్న కీలకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైనా ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు.

గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్‌ ఘనవిజయం సాధించడం తెలిసిందే. ప్రాంతీయ పార్టిల నేతల్లో మమత వంటి దిగ్గజాలే మోదీ సర్కారు ధాటికి వెనుకంజ వేసినా కేజ్రీవాల్‌ మాత్రం ప్రధానితో నిత్యం ఢీ అంటే ఢీ అంటున్నారు. అలా పదేళ్లుగా బీజేపీకి కంట్లో నలుసుగా మారారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు ఎలాగైనా ముకుతాడు వేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. కేజ్రీ గైర్హాజరీలో డీలా పడ్డ ఆప్‌ నేతలను నయానో భయానో లొంగదీసుకుని ఆ పార్టీ ఉనికే లేకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేయడం ఖాయమంటున్నారు.
 
సానుభూతి కష్టమే...?
అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించడం ద్వారా రాజకీయాల్లోకి వచి్చన కేజ్రీవాల్‌ అవినీతి కేసులో జైలుపాలు కావడాన్ని సమర్థించుకోవడం ఆప్‌ నేతలకు కష్టంగానే కని్పస్తోంది. ఆ పార్టీ వాదన ఎలా ఉన్నా ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం వాస్తవమేనన్న అభిప్రాయం ప్రజల్లో గట్టగా ఉంది. కనుక కేజ్రీవాల్‌కు, ఆయన అరెస్టు విషయంలో ఆప్‌కు పెద్దగా సానుభూతి లభించే అవకాశాలు లేవంటున్నారు. ఆప్‌ వర్గాలను మరింతగా noకలవరపరిచే అంశమిది. మద్యం ఆదాయంపై అత్యాశ వద్దని తానెంత చెప్పినా కేజ్రీ విన్లేదంటూ ఆయనకు గురుతుల్యుడైన సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే చేసిన తాజా వ్యాఖ్యలు ఆప్‌కు మరింత చేటు చేసేవే.

‘ఇండియా’ కూటమి డీలా
ఇప్పటికే జనాకర్షక నాయకుల కొరత ఉన్న కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి కూడా కేజ్రీవాల్‌ అరెస్టుతో మరింతగా డీలా పడింది. జేడీ(యూ) చీఫ్‌ నితీశ్‌కుమార్, తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీ వంటి అగ్ర నేతలు ఇప్పటికే కూటమిని వీడారు. దాంతో సోనియా, రాహుల్, ఖర్గే తర్వాత కేజ్రీవాల్‌ మినహా దేశవ్యాప్త ఆదరణ ఉన్న నాయకులు కూటమిలో పెద్దగా లేరు. ఖాతాల స్తంభన తదితరాలతో ఇప్పటికే నిధుల కొరతతో కిందా మీదా అవుతున్న కాంగ్రెస్‌ను ఈ పరిణామం మరింతగా నిస్తేజపరుస్తోంది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement