ఢిల్లీ: సెన్సార్ కట్టింగుల బాధలేని ‘ఓటీటీ కంటెంట్’ విషయంలో కేంద్రం మరోసారి సీరియస్‌గా స్పందించింది. భారత సమాజాన్ని.. మత సంప్రదాయాలను కించపరిచేలా ఉన్న కంటెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌కు సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చింది.
ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ ప్రతినిధితులతో మంగళవారం కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో భారతీయ సంస్కృతిని, సమాజాన్ని కించపరిచేలా ఉండే కంటెంట్‌ను ప్రభుత్వం అనుమతించబోదని వాళ్లకు స్పష్టం చేశారాయన. పాశ్చాత్య ప్రభావం, మన మతాలు.. సంప్రదాయాలను తప్పుగా స్మార్ట్ తెరపై చూపించే విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారాయన.
ఇలాంటి వ్యవహారాలకు శిక్షలు కఠినంగా ఉండాలనే తాము యోచిస్తున్నట్లు తెలిపారాయన. దుర్మార్గపు ప్రచారంతో పాటు సైద్ధాంతిక పక్షపాతాల సాధనంగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించవద్దని మంత్రి ఈ సందర్భంగా ఓటీటీ ప్రతినిధులకు సూచించారు.
ఓటీటీ ఉల్లంఘనలకు శిక్షాస్పద నిబంధనలను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, మరియు డిజిటల్ పైరసీని ఎదుర్కోవడంపై కూడా ఈ భేటీలో చర్చించారు. వీలైనంత త్వరగా సంబంధిత ప్రతిపాదనలతో తిరిగి కేంద్రం ముందుకు రావాలని వాళ్లను ఆయన కోరినట్లు తెలుస్తోంది. అయితే.. ఓటీటీకి సెన్సార్ ఉండాలనే అంశం గురించి మీడియా నుంచి మంత్రికి ప్రశ్న తలెత్తగా.. పరిశీలిస్తామంటూ ఆయన దాటవేత ధోరణి ప్రదర్శించారు.
ఇదీ చదవండి: కళ్ల ముందు కనిపిస్తున్నా.. కలిసి ఉండేది కష్టమేనా?
Comments
Please login to add a commentAdd a comment