పట్టు సడలించి డిప్యూటీ సీఎం పదవికి పరిమితం కానున్న ఏక్‌నాథ్ షిండే
షిండేతో పాటు మరో డిప్యూటీగా అజిత్ పవార్ !
ప్రధాని మోదీ, అమిత్ షాల నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న షిండే
తుది అంకానికి చేరిన ‘మహా’ హైడ్రామా
కేబినెట్ కూర్పుపై నేడు ఢిల్లీలో అమిత్ షాతో షిండే, ఫడ్నవిస్, అజిత్ భేటీ
ముంబై/థానే: ఎవరికీ మెజారిటీరాని, హంగ్ సందర్భాల్లో కనిపించేంత ఉత్కంఠను కొనసాగించిన ‘మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు?’ అంశానికి నేటితో తెరపడనుంది. గతంలో ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా సేవలందిస్తున్న మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం దాదాపు ఖాయమైంది.
మహాయుతి కూటమిని శాసనసభ ఎన్నికల పర్వంలో విజయతీరాలకు చేర్చినందుకు మళ్లీ తననే సీఎంగా చేయాలని పట్టుబట్టిన శివసేన చీఫ్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కాస్తంత మెత్తబడ్డారు. దీంతో ఫడ్నవిస్ పట్టాభిషేకానికి అవరోధాలు దాదాపు తొలగిపోయాయి. నేడు ఢిల్లీలో బీజేపీ అగ్రనేత అమిత్ షాతో ఏక్‌నాథ్ షిండే భేటీ తర్వాత కేబినెట్ కూర్పుపై తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
కూటమి ధర్మాన్ని పాటిస్తూ మళ్లీ తనకే సీఎం పదవి ఇవ్వాలని పట్టుబట్టిన షిండే బుధవారం పట్టు సడలించారు. నూతన సీఎం ఎంపికపై ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్‌షాల నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని బుధవారం షిండే చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి. దీంతో ఫడ్నవిస్ సారథ్యంలో బీజేపీ సర్కార్ కొలువుతీరడం దాదాపు ఖాయమైంది. ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ చీఫ్ అజిత్‌పవార్‌లు ఉప ముఖ్యమంత్రి పదవులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 30 లేదా డిసెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని అజిత్ పవార్ బుధవారం చెప్పారు.
2, 3 గంటలే నిద్రపోయా
‘‘మహాయుతికి ఘన విజయం అందించిన మహారాష్ట్ర ఓటర్లకు కృతజ్ఞతలు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం విస్తృతంగా తిరిగా. ఎన్నికల ప్రచారం వేళ రోజుకు కేవలం 2,3 గంటలే నిద్రపోయా. ప్రజల కోసం నేరుగా పనిచేయడంలో నేను ఇప్పటికీ కార్యకర్తనే. నా దృష్టిలో సీఎం అంటే కామన్‌మ్యాన్. నేనేమీ అసంతృప్తిలో లేను. మేం పోరాటం చేశాం. ఇక్కడ ఏడ్వాల్సిన అవసరం లేదు. పాపులర్ అవ్వాలని సీఎంగా చేయలేదు. ప్రజల సంక్షేమం కోసమే పదవిలో కొనసాగా’’ అని షిండే వ్యాఖ్యానించారు.
బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని షిండే ప్రకటించడం ఆనందంగా ఉందని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే చెప్పారు. ‘‘ విపక్షాల పుకార్లను పటాపంచలు చేస్తూ షిండే చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఆయనను చూసి గర్వపడుతున్నా. సీఎంగా ఆయన అద్భుతంగా పాలించారు’’ అని బవాంకులే పొగిడారు. షిండే మహాయుతి ప్రభుత్వానికి కన్వీనర్‌గా ఉంటారని వార్తలొచ్చాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో తాజా ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 సీట్లను కైవసం చేసుకుని ఘన విజయం సాధించడం తెల్సిందే. బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్‌సీపీ(అజిత్‌పవార్) 41 చోట్ల గెలిచాయి.
మా వైపు స్పీడ్ బ్రేక్ లేదన్న షిండే
ఘన విజయం తర్వాత ఐదు రోజులకు తొలిసారిగా బుధవారం థానేలోని స్వగృహంలో 60 ఏళ్ల షిండే మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ కొత్త సీఎం విషయంలో మోదీ, అమిత్ షాల నిర్ణయంతో ఏకీభవిస్తా. ఈ ఎంపిక ప్రక్రియలో నేను అవరోధంగా ఉండబోను. బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు, శివసేనకు సమ్మతమే అని నిన్ననే వాళ్లతో ఫోన్ సంభాషణల్లో స్పష్టం చేశా. రెండోదఫా అవకాశం దక్కదని తెల్సి నిరాశచెందానన్న వార్తల్లో నిజం లేదు.
వాస్తవానికి సీఎంగా నా ప్రభుత్వానికి బీజేపీ మద్దతు పలికిందన్న విషయం మర్చి పోవద్దు. కొత్త సీఎం వ్యవహారంలో శివసేన నేతల్లో ఎలాంటి కోపతాపాలు, అసహనం లేవు. గురువారం ఢిల్లీలో అమిత్ షాను నేను, ఫడ్నవిస్, అజిత్‌పవార్ కలవ బోతున్నాం. ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు ఖరారవుతాయి’’ అని అన్నారు. ‘‘ కొత్త ప్రభుత్వం కొలువు తీరే అంశం గురువారంతో తేలిపోనుంది’’ అని షిండే అన్నారు. నవంబర్ 30 లేదా డిసెంబర్ ఒకటో తేదీన సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment