
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులు విరాళం అందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్న ఓ నాయకుడు రామ మందిర నిర్మాణానికి రూ.లక్ష 11 వేల 111 విరాళం ఇవ్వడం గమనార్హం. ఆయనే డిగ్గీ రాజాగా పేరొందిన దిగ్విజయ్ సింగ్. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.
ఆ లేఖలో మత కలహాలకు వ్యతిరేకం కానీ.. ఆలయ నిర్మాణానికి కాదని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ ఆపాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ హిందూవుల పార్టీ అని విమర్శించిన డిగ్గీ రాజా ఇప్పుడు రామ మందిర నిర్మాణానికి విరాళం ప్రకటించడం విశేషం. గతంలో ఆయన ఆలయ నిర్మాణంపై విమర్శలు కూడా చేశారు. అలాంటి వ్యక్తి నుంచి విరాళం రావడం ఆశ్చర్యమేస్తోంది. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి విశ్వహిందూ పరిషత్ 44 రోజుల పాటు విరాళాల సేకరణ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది.