
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ఆ రోజు చత్తీస్‌గఢ్‌లో డ్రై డే అమలవుతుందని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ప్రకటించారు. రాష్ట్రంలో డిసెంబర్ 25 నుంచి జనవరి రెండు వరకు జరిగిన గుడ్ గవర్నెన్స్ వీక్ చివరి రోజున ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ఈ ప్రకటన చేశారు.
రాష్ట్రంలో సుపరిపాలన వారోత్సవాలు జరుపుకుంటున్నామని, సుపరిపాలనే తమ సంకల్పం అని, రామరాజ్యమే తమ ఆదర్శమని సీఎం సాయి అన్నారు. అయోధ్యలో జరగబోయే శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్రంలోని వరి ఉత్పత్తి సంస్థల ద్వారా సుమారు మూడు వేల టన్నుల బియ్యాన్ని పంపించామని సీఎం చెప్పారు. త్వరలో కూరగాయలు కూడా పంపించబోతున్నామన్నారు.
జనవరి 22న అయోధ్యలో జరిగే శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని ప్రతి ఇంటిలో ప్రత్యేకంగా దీపాలు వెలిగించనున్నారు. అలాగే రాష్ట్రమంతటా జనవరి 22ని డ్రై డేగా పాటిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఆరోజు రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరగవు.
ఇది కూడా చదవండి: శ్రీరాముని సేవలో ట్రిపుల్ తలాక్ బాధితులు