సాక్షి, అహ్మదాబాద్ : గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. ఒకపక్క కరోనా విలయంతో దేశ ప్రజలు వణికిపోతోంటే..ఆసుపత్రిలో సంభవించిన అగ్నిప్రమాదం మరింత ఆందోళన రేపింది. అహమ్మాదాబాద్ లోని కోవిడ్-19 ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది కరోనా రోగులు సజీవ దహనం కావడం తీవ్ర విషాదాన్ని నింపింది.
నవరంగపురలోని శ్రేయ్ ఆసుపత్రిలో గురువారం తెల్లవారుజామున 3:30 గంటలకు భారీగా మంటలు చెలరేగాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో 8 మంది రోగులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. సుమారు 40 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఈ ప్రమాదానికి కారణం తెలియరాలేదు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అహ్మదాబాద్ నగర బి డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఎల్బీ జాలా తెలిపారు. చాలామందిని రక్షించినట్టు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment