న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చాలా కాలంగా తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు సోనియా గాంధీ. కొత్త అధ్యక్షుడి కోసం పార్టీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 21 నుంచి కొత్త అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. ఆ పదవికి పోటీ పడే అంశంపై పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఎలాంటి ప్రకటన చేయకపోవటంపై ఉత్కంఠ నెలకొంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైన క్రమంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం మరోమారు పార్టీ పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నా.. ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
గాంధీయోతర వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవటంపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. అయితే, ఈ విషయంపై ఏకాభిప్రాయం కుదరటం లేదు. కాంగ్రెస్ నేతల్లో చాలా మంది అధ్యక్ష పదవి గాంధీ కుటుంబంలోని వ్యక్తే చేపట్టాలని, అదే పార్టీ భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోయిన సందర్భంలో పార్టీ సీనియర్ నేతలకు కీలక సూచనలు చేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు రాజీనామా చేయాలని సూచించారు.
రాహుల్ గాంధీ 2017లో సోనియా గాంధీ నుంచి పార్టీ పగ్గాలు తీసుకున్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 543 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలకే పరిమితం కావటంతో మే నెలలో పార్టీ పగ్గాలను వదులుకున్నారు రాహుల్ గాంధఈ. పార్టీ అధ్యక్షుడి ఎన్నికల తర్వాతే.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఇతర పోస్టులకు ఎన్నికలు నిర్వహించటం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ ప్రస్తుతం సెప్టెంబర్ 7న ప్రారంభించనున్న భారత్ జోడో యాత్రపైనే దృష్టిసారించారు.
ఇదీ చదవండి: బీహార్ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్ ప్రమాణం.. డిప్యూటీగా ఆర్జేడీ నేత తేజస్వి
Comments
Please login to add a commentAdd a comment